
సారొస్తారా..!
సీఎం పర్యటన ఆనవాయితీ కొనసాగేనా..
2015, 2016 జనవరిలో వచ్చిన కేసీఆర్
మూడునాలుగు రోజులపాటు జిల్లాలోనే..
ఈ ఏడాది పర్యటనపై అందరిలో ఆసక్తి
వరంగల్ : తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంలో నిలిచిన వరంగల్ జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత అధికారికంగా ఎక్కువ రోజులు వరంగల్ జిల్లాలోనే ఉన్నారు. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్‌లో పర్యటించారు. టీఆర్‌ఎస్ అధినేతగా తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఎక్కువసార్లు వరంగల్ నగరానికి వచ్చిన కేసీఆర్.. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాతే కూడా అదే పరంపరను కొనసాగించారు. కేసీఆర్ సీఎం పదవి చేపట్టాక ప్రతి ఏడాది జనవరిలో వరంగల్ జిల్లాలో మూడునాలుగు రోజులు బస చేశారు. 2015, 2016 జనవరి నెలల్లో ఇదే ఒరవడిని కొనసాగించారు. వరుసగా రెండేళ్లు వరంగల్ జిల్లా పర్యటనకు ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్... 2017లోనూ ఇదే ఆనవాయితీని కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై జిల్లా ప్రజల్లో, టీఆర్‌ఎస్ నేతల్లో చర్చ జరుగుతోంది.
మొదటిసారే నాలుగు రోజులు బస
2015 జనవరిలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరంగల్ పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏ సీఎం చేయని విధంగా కేసీఆర్ వరంగల్ నగరంలో వరుసగా నాలుగు రోజులు పర్యటించి రికార్డు సృష్టించారు. జనవరి 8న సాయంత్రం ఆకస్మికంగా వరంగల్‌కు వచ్చిన సీఎం... వరుసగా నాలుగు రోజులు జిల్లాలోనే ఉన్నారు. వస్తూ వస్తూనే వరంగల్ తూర్పు నియోకవర్గంలోని లక్ష్మీపురం, గిరిప్రసాద్‌నగర్, శాకరాసికుంట బస్తీల్లో పర్యటించారు. పేదల సమస్యలను, ప్రభుత్వ పథకాల అమలుతీరును వారితోనే అడిగి తెలుసుకున్నారు. జనవరి 9న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని దీన్‌దయాళ్‌నగర్, ప్రగతినగర్, నాగేంద్రనగర్, జితేందర్‌నగర్ బస్తీలకు వెళ్లి అక్కడి పేదలతో నేరుగా మాట్లాడారు. బస్తీ వాసుల సమస్యలను, అవసరాలను తెలుసుకున్నారు. అదే రోజు హన్మకొండలో జరిగిన అర్చక సమాఖ్య బహిరంగసభలో పాల్గొన్నారు. అనంతరం గణపురం మండలం చెల్పూరులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) గెస్ట్‌హౌస్‌లో భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జనవరి 10న వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఎస్‌ఆర్ నగర్,పరకాల నియోజకవర్గంలోని గరీబ్‌నగర్ బస్తీలను సందర్శించారు. జనవరి 11న వరంగల్ నగరపాలక సంస్థలోని ఆరు బస్తీల్లో కొత్తగా నిర్మించనున్న మోడల్ కాలనీలకు శంకుస్థాపన చేశారు.
రెండోసారి మూడు రోజులు
2016 జనవరిలో సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో వరుసగా మూడు రోజులు ఉన్నారు. జనవరి 4న వరంగల్ జిల్లా పర్యటకు వచ్చారు. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులు, వ రంగల్–ఖమ్మం జిల్లాల మధ్య గోదావరిపై వంతెనను కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ప్రారంభించారు. జనవరి 5న గణపురం మండలం చెల్పూరులో 600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన కేటీపీపీ రెండో దశ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు. జనవరి 6న వరంగల్ జిల్లా, గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్‌ను ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.