
సీఎం వరంగల్ పర్యటన షెడ్యూల్ ఖరారు
వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి వరంగల్ చేరుకుంటారు. 3:55 గంటలకు మడికొండకు చేరుకుని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి వరంగల్- యాదాద్రి జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రానికి టీఆర్ఎస్ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుని అక్కడే బసచేస్తారు.
మంగళవారం(5వ తేదీన) ఉదయం 10:30 గంటలకు హన్మకొండ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి.. చెల్పూరు చేరుకుంటారు. అక్కడ జెన్కో నిర్మించిన 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటును జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం 1:30కు తిరిగి వరంగల్ వచ్చి.. కలెక్టర్ కార్యాలయంలో జరిగే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ సమావేశం కొనసాగనుంది. మంగళవారం రాత్రి కూడా లక్ష్మీకాంతరావు ఇంట్లోనే సీఎం కేసీఆర్ బసచేయనున్నారు.
కాగా, ముఖ్యమంత్రితో కలిసి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసే కేంద్ర మంత్రి గడ్కరీ.. అటు నుంచి హైదరాబాద్ చేరుకుని గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మల్కాజిగిరిలో నగర బీజేపీ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి గడ్కరీ ప్రసంగిస్తారు.