
రహదారులకు 41 వేల కోట్లు
♦ కొత్తగా 1,800 కిలోమీటర్ల జాతీయ రహదారులు: నితిన్ గడ్కరీ
♦ హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవేలు
♦ సీఎం కేసీఆర్ ప్రతిపాదనల మేరకు మంజూరు చేస్తున్నాం
♦ గోదావరి నదిలో జలరవాణాకు ఏర్పాట్లు
♦ రాష్ట్రం ముందుకు వస్తే నియోజకవర్గానికో డ్రైవింగ్ స్కూల్
♦ వరంగల్-యాదగిరిగుట్ట జాతీయ రహదారి విస్తరణకు శంకుస్థాపన
సాక్షి, హన్మకొండ: రాష్ట్రంలో రూ. 41 వేల కోట్లతో భారీ ఎత్తున రహదారులను విస్తరిస్తామని.. పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చుతామని కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-విజయవాడల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవేలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం వరంగల్ జిల్లా మడికొండ వద్ద వరంగల్-యాదగిరిగుట్ట మధ్య 163 నంబర్ జాతీయ రహదారి విస్తరణ పనుల ప్రారంభోత్సవంలో గడ్కరీ పాల్గొన్నారు. దీంతోపాటు వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం ముల్లకట్ట-ఖమ్మం జిల్లా వాజేడు మండలం పూసురు మధ్య గోదావరి నదిపై నిర్మించిన భారీ వంతెనను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గడ్కరీ ప్రసంగించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పంపిన ప్రతిపాదనల ప్రకారం... రాష్ట్రంలో 1,800 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మొత్తంగా తెలంగాణలో రహదారుల అభివృద్ధికి రూ. 41 వేల కోట్ల ప్యాకేజీ ఇస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలూ ఒక్కటేనని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం తనవంతు సాయం అందిస్తుందని గడ్కరీ చెప్పారు. కొత్త జాతీయ రహదారుల వల్ల రాబోయే రోజుల్లో తెలంగాణ ముఖచిత్రం మారిపోతుందని వ్యాఖ్యానించారు.
రెండు ఎక్స్‌ప్రెస్ హైవేలు..
మహారాష్ట్రలోని పుణె-ముంబై మధ్య ఉన్న ఎక్స్‌ప్రెస్ హైవే తరహాలో రూ.8,400 కోట్లతో హైదరాబాద్-బెంగళూరు మధ్య 550 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మిస్తామని... అందులో 220 కిలోమీటర్లు తెలంగాణలో ఉంటుందని గడ్కరీ చెప్పారు. హైదరాబాద్-విజయవాడ మధ్య రూ. 7,600 కోట్ల వ్యయంతో మరో ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మిస్తామని.. 270 కిలోమీటర్ల నిడివిగల ఈ మార్గంలో 190 కిలోమీటర్లు తెలంగాణలో ఉంటుందన్నారు. గోదావరి నదిపై ముల్లకట్ట వద్ద 340 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన వంతెన వల్ల ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ కోరిక మేరకు వాజేడు-భద్రాచలం-కౌతాల మధ్య రహదారిని జాతీయ రహదారిగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. చవకగా జరిగే జలరవాణాను ప్రోత్సహిస్తామని గడ్కరీ చెప్పారు. దేశంలో జల రవాణా వాటా 3.5 శాతమేనని... దీనిని పెంచేందుకు 111 జల మార్గాలను అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు. గోదావరి నదిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న బ్యారేజీల వల్ల నదిలో మూడు మీటర్ల లోతు నీరుండేందుకు అవకాశం ఉందని... దానివల్ల రైతులకు సాగునీరు, పర్యాటక రంగం అభివృద్ధితో పాటు జల రవాణాకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. నేల, నీటిపై నడిచే విధంగా బస్సులను, వాటర్ వెహికల్స్‌ను తయారు చేస్తామన్నారు.
డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తాం..
దేశంలో ఏటా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని... రెండు లక్షల మంది మృత్యువాత పడుతుండగా, మరో మూడు లక్షల మంది గాయాల పాలవుతున్నారని గడ్కరీ చెప్పారు. 30 శాతం మంది డ్రైవర్లు బోగస్ లెసైన్సులతో వాహనాలు నడుపుతున్నట్లు తేలిందన్నారు. దేశంలో డ్రైవర్ల కొరత 22 శాతం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే ప్రతి నియోజకవర్గంలో డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇక ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న యాక్సిడెంట్ పాయింట్లను గుర్తించాలని, ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. 2016 జనవరి 26న దేశవ్యాప్తంగా 350 రైల్వే ఓవర్‌బ్రిడ్జిల మంజూరు ప్రకటన వెలువడనుందని, అందులో 12 తెలంగాణలో ఉన్నాయని వెల్లడించారు. ఇక కాలుష్యాన్ని నివారించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు, ఇథనాల్, బయోడీజిల్ ఆధారిత వాహనాలను ప్రోత్సహిస్తామని గడ్కరీ చెప్పారు.