సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌లో రూ.5 లక్షల కోట్లతో జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 2024 నాటికి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో రూ.3,000 కోట్లతో 129 కిలోమీటర్ల 3 రహదారులు, 5 ఫ్‌లై ఓవర్ల పనులకు గురువారం వర్చువల్ విధానంలో ఆయన శంకుస్థాపన చేశారు.
దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఏపీ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో రహదారులకు ఇప్పటికే రూ.2 లక్షల కోట్లు మంజూరు చేశామని, లక్ష కోట్ల రూపాయల పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. నౌకాయానంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన రాష్ట్రమన్నారు. సుదీర్ఘమైన తీర ప్రాంతం, సముద్ర ఉత్పత్తులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నాయన్నారు.
రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గోదావరి జిల్లాల ఎంపీల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. మొత్తం 27 గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. వీటిలో భాగంగా విశాఖపట్నం పోర్టు నుంచి రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకు ఆరు వరుసల రోడ్డు నిరి్మంచనున్నట్లు చెప్పారు. రూ. 215 కోట్లతో మోరంపూడి, జొన్నాడ, కైకారం, ఉండ్రాజవరం, తేతలి ఫ్‌లై ఓవర్లకు అనుమతిచ్చామన్నారు.
గుంటూరు – బాపట్ల, బెంగళూరు – విజయవాడ, వినుకొండ – గుంటూరు, వేమగిరి – సామర్లకోట కెనాల్ రోడ్డు, రాజమండ్రి – కాకినాడ, హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్, మాచర్ల, అమరావతి మీదుగా విజయవాడ ఇబ్రహీంపట్నం వరకు రోడ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. బెంగళూరు – విజయవాడ, బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే, రాయ్‌పూర్ – విశాఖపట్నం, ఛత్తీస్‌గఢ్ – ఆంధ్రప్రదేశ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తామన్నారు.
భువనేశ్వర్ నుంచి భోగాపురం వరకు 6 వరుసల హైవే నిరి్మంచనున్నట్లు చెప్పారు. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు మంజూరు చేస్తామన్నారు. వీటి ద్వారా పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. హైదరాబాద్, విశాఖ నుంచి కాకినాడ సెజ్ పోర్ట్, ఫిషింగ్ హార్బర్, కాకినాడ యాంకరేజ్ పోర్టులకు గ్రీన్ ఫీల్డ్ రోడ్ కనెక్టివిటీ వస్తుందని చెప్పారు. దీనివల్ల బియ్యం, సీ ఫుడ్, ఆయిల్, ఐరన్ ఎగుమతులు ఎక్కువ జరుగుతాయన్నారు. కాకినాడ పోర్టు ద్వారా ఖనిజం, జీవ ఇంధనం, గ్రానైట్ రవాణా సులభమవుతుందని అన్నారు.
రహదారులు, ఫ్లై ఓవర్లకు శంకుస్థాపన చేస్తున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
భవిష్యత్తు గ్రీన్ ఎనర్జీదే
భవిష్యత్తు అంతా గ్రీన్ ఎనర్జీదే అని గడ్కరీ చెప్పారు. ఏపీ ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థలో విద్యుత్, బయోఇథనాల్ వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. వీటిని స్వయంగా తయారు చేసుకునే వనరులు రాష్ట్రంలో అపారంగా ఉన్నాయన్నారు. గోదావరి నీళ్ల ద్వారా గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడం పెద్ద కష్టం కాదన్నారు. జాతీయ రహదారుల వెంట కడియం నర్సరీల నుంచి 80 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు.
శంకుస్థాపన అనంతరం గడ్కరీ కడియంలో నర్సరీలను పరిశీలించారు. మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్ రామ్, వంగా గీత, అనూరాధ, మాధవి, ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment