గణపురం,న్యూస్‌లైన్ : మండల పరిధిలోఉన్న చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)లో ఈఎస్పీలో ఏర్పడిన సాంకేతిక లోపం మూలంగా ప్లాంట్ మొత్తం బూడిదతో నిండిపోయింది. జూన్25 నుంచి జూలై 26 వరకు ప్లాంటును వార్షిక మరమ్మతుల కోసం మూసివేసిన విషయం విదితమే. జూలై 27వ తేదీ నుంచి తిరిగి విద్యుత్ ప్రారంభమైంది. కనీసం వారం రోజులైనా నడవక ముందే ప్లాంట్‌లో బూడిద సమస్య మళ్లీ తలెత్తడంతో విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది. బూడిద పైపులైన్ లీకేజీ కావడంతో ఆది వారం ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి 500మెగావాట్ల నుంచి 250 మెగావాట్లకు పడిపోవడవంతో అధికారులు తలలు పట్టుకున్నారు.
ఈ సమస్య మరో రెండు మూడు రోజుల్లో పరిష్కారం కాకుంటే మళ్లీ షట్‌డౌన్ చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ నెలలో బూడిద సమస్య మూలంగానే వార్షిక మరమ్మతుల పేరిట ప్లాంటును షట్‌డౌన్ చేశారు. బూడిదను సైలో నిర్మాణాలకు సరఫరా చేసే పైపులైన్‌ను మరమ్మతు చేయడంలో కేటీపీపీ అధికారులు పూర్తిగా విఫలం కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గతంలో బూడిద పైపులు పగలడం వల్ల దుబ్బపల్లి గ్రామస్తులు తీవ్ర ఇబ్బం దులు పడి ఆందోళనలు చేపట్టారు. తాజాగా ప్లాంటులోని ఈఎస్పీలో బూడిద లీకేజీ కావడంతో ప్లాంటులో పనులు చేస్తున్న కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి పడిపోవడంతో అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు.
బూడిదతో నిండిన కేటీపీపీ
Published Mon, Aug 5 2013 4:03 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
Advertisement