రూ. 52.54 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి
Published Thu, Aug 8 2013 2:45 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు నెల రోజులుగా కూలి డబ్బులు ఆగిపోయాయి. జిల్లాకు రావాల్సిన మొత్తం రూ. 52.54 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. ఎన్నికల కోడ్.. ఉపాధి హామీ పనులకు అడ్డంకి కాకపోయినా కోడ్ కారణంగానే డబ్బులు ఆగిపోయినట్లు క్షేత్ర స్థాయి ఉద్యోగులు కూలీలను మభ్యపెడుతున్నారు. నిజానికి రాష్ట్ర స్థాయి నుంచే నిధులు విడుదల కాకపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. వారానికోసారి ఖాతాల్లో జమ కావాల్సిన డబ్బు రాకపోవడంతో దాదాపు 31వేల మంది కూలీలు దిక్కులు చూస్తున్నారు. మరోవైపు పే ఆర్డర్లు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసినప్పటికీ డబ్బులు జమ కావడం లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు.
ఉపాధి హామీ పథకం నిబంధనల ప్రకారం... ఉపాధి పనులు చేసే కూలీలకు వారం రోజుల వ్యవధిలోనే డబ్బులు చెల్లించాలి. వేతనాల చెల్లింపులో ఆలస్యమైతే సంబంధిత క్షేత్రస్థాయి ఉద్యోగులు మొదలు ప్రాజెక్టు ఆఫీసర్ల వరకు బాధ్యత వహించాలి. 14 రోజులకు మించి ఆలస్యమైతే అందుకు బాధ్యులైన అధికారులకు 0.3 శాతం చొప్పున జరిమానా విధించాలి. ఇవన్నీ పక్కన బెట్టినట్లుగా... నెల రోజులుగా సర్కారు ఉపాధి నిధులను ఆపేయడంతో అటు ఉద్యోగుల్లోనూ... ఇటు క్షేత్రస్థాయిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
మంగళవారం నాటి ఆన్‌లైన్ నివేదికల ప్రకారం జిల్లాలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన 31308 పే ఆర్డర్లకు బిల్లులు నిలిచి పోయాయి. అందుకు సంబంధించి దాదాపు రూ.52.54 కోట్ల చెల్లింపులు ఆలస్యపు జాబితాలో చేరిపోయాయి. నిబంధనల ప్రకారం ఈ ఆలస్యానికి బాధ్యులైన ఉద్యోగులకు రూ.75.95 లక్షలు జరిమానా విధించి వారి వేతనాల్లో కోత వేయాలి. పేమేంట్ ఏజెన్సీలు ఆలస్యం చేసినా సరే.. ఇదే నిబంధన వర్తిస్తుంది. ఆలస్యానికి తమ వంతు వాటాగా రూ.16.43 లక్షలు ఏజెన్సీలకు కోత వేయాలి. ఈ ఆలస్యపు చెల్లింపులకు తగిన కారణాలను... ఉద్యోగుల వివరణలను పరిశీలించిన ప్రాజెక్టు డెరైక్టర్ రూ.15.99 లక్షల జరిమానాలను తిరస్కరించారు. రూ.10.53 లక్షల జరిమానాలకు ఆమోదం తెలిపారు.
మిగతా రూ.65.86 లక్షల జరిమానా ఫైళ్లు ప్రాజెక్టు డెరైక్టర్ పరిశీలనలో ఉన్నాయి. ఈ లెక్కన ఉపాధి నిధుల చెల్లింపు ఇష్టారాజ్యంగా సాగుతోందని రూఢీ అవుతోంది. ఇప్పటికే ఎంపీడీవోల పరిధి నుంచి ఈ పథకాన్ని కాంట్రాక్టు ఉద్యోగులకు అప్పగించిన విషయం తెలిసిందే. మరోవైపు ఎన్నికల కో డ్ పేరిట నిధులు ఆగిపోయిన తీరు గందరగోళానికి తెర లేపుతోంది. కూలీలకు ఉపాధి కల్పించేందుకు చేపట్టాల్సిన పనుల ఎంపిక సైతం గాడి తప్పుతోంది. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో ఇందిరమ్మ పచ్చతోరణం, మహా త్మాగాంధీ వన నర్సరీ, పండ్లతోటల పెంపకం తప్ప మిగతా పనులేవీ చేపట్టకుండా ఆంక్షలు విధించారు. దీంతో పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. ఈ పథకాల్లో చేప ట్టే పనులన్నీ రైతులకు తప్ప కూలీలకు ఉపయుక్తంగా లేవనే విమర్శలు వస్తున్నాయి.
Advertisement