అవసరం తీరింది మరి..!
Published Thu, Aug 8 2013 2:58 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
వరంగల్, న్యూస్‌లైన్ : గ్రామాల్లో కరెంట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పంచాయతీ ఎన్నికల ముందు గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించిన సర్కారు... ఎన్నికలు ముగిసిన మరునాటి నుంచే కోతలను అమలు చేస్తున్నది. గత నాలుగు రోజుల నుంచి కరెంట్ సరఫరాలో కోతలు ఎక్కువయ్యాయి. పగటిపూట త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేసినప్పుడు మాత్రమే గ్రామాలకు ఇస్తున్నారు. సింగిల్ ఫేజ్ లైన్లకు పగలంతా మొత్తం నిలిపివేస్తున్నారు.
ప్రస్తుతం ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాలకు ఇచ్చే కరెంట్ కేవలం 4గంటలు మాత్రమే. పంచాయతీ ఎన్నికల ముందు ప్రభుత్వం గ్రామాల్లో ఓట్లను రాబట్టుకునేందుకు విద్యుత్‌ను ఎరగా వేసింది. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో కరెంట్ పూర్తిస్థాయిలో ఇవ్వడంతో అక్కడ అధికార పార్టీకి మొగ్గు ఉంటుందని భావించిన సర్కారు.. పగలు, రాత్రి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిస్కంలకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో ఎన్పీడీసీఎల్ పరిధిలోని గ్రామాలకు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేశారు.
పట్టణాల్లో కొంత సమయం కోతలు విధించినప్పటికీ... గ్రామాలకు మాత్రం పూర్తిస్థాయిలో సరఫరా చేశారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో కూడా తేడా రాకుండా చర్యలు తీసుకున్నారు. కొన్ని ఫీడర్లకు ఒకే విడతలో ఏడు గంటలు సైతం సరఫరా చేశారు. రాత్రిపూట ఇచ్చే కరెంట్‌ను అదనంగానే పరిగణించారు. అయితే విద్యుత్ వాడకం తక్కువగా ఉండటంతో... గ్రామాలకు పూర్తిస్థాయిలో కరెంట్ ఇస్తున్నట్లు సర్కారు, డిస్కంలు ప్రకటించాయి.
ఇప్పుడేమైందంటే...
పంచాయతీ ఎన్నికలు ముగిసిన మరునాడు నుంచి గ్రామాల్లో విద్యుత్ కోతలు పునరావృతమయ్యాయి. ఈ విషయం గ్రామాల్లోని ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు. ఉదయం 6 గంటలకు సింగిల్‌ఫేజ్ సరఫరా నిలిపివేస్తుండగా... 9 గంటలకు త్రీఫేజ్ సరఫరా ఇస్తున్నారు. మధ్యాహ్నం 1గంటకు మళ్లీ సరఫరాకు బ్రేక్ వేసి... సాయంత్రం 6 గంటలకు తిరిగి సింగిల్‌ఫేజ్ కరెంట్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ పనులు ఊపందుకోవడంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరుగుతోందని, కోతలు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ కోత పంచాయతీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచే అమల్లో పెడుతున్నట్లు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన 26 రోజుల పాటు గ్రామాల్లో సరఫరాలో ఎలాంటి బ్రేక్‌డౌన్‌లు లేవు. కానీ... ఎన్నికలు ముగిసిన మరునాటి నుంచే సరఫరా ఆపేస్తున్నారు. సంగెం మండలం గాడెపల్లిలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వ్యవధిలో కేవలం నాలుగు గంటలు సరఫరా ఇచ్చారు. ఈ నాలుగు గంటల వ్యవధిలో దాదాపు పది సార్లు పది నిమిషాల పాటు ఈఎల్‌ఆర్(ఎమర్జన్సీ లోడ్ రిలీఫ్) తీసుకున్నారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో కూడా అడపదడపా కోత పెట్టారు. అయితే ఇటీవల వరుసగా వానలు కురువడంతో ప్రస్తుతం రాత్రి విద్యుత్ వినియోగం అంతగా లేదని అధికారులే చెబుతున్నారు. కానీ, గ్రామాలకు కోతలు మాత్రం యథావిధిగానే అమలు చేస్తున్నారు.
పగలు రెండు గంటలే
గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో కరెంట్‌ను కోతలు లేకుండా ఇచ్చారు. ఎన్నికలు కాగానే కోతలు విధిస్తున్నారు. ఆ సమయంలో వర్షాలు కురిసినవి వ్యవసాయానికి అవసరం లేదు. ఇప్పుడు వరినారు పెరిగింది. నాటు వేసే సమయంలో కరెంట్ కోతలు విధిస్తున్నారు. పగటిపూట కేవలం రెండు గంటలే ఇస్తున్నారు. అది కూడా ప్రతి పది నిమిషాలకొకమారు ట్రిప్పు అవుతున్నది. దోణి తడవడం లేదు, దోయ్యపారడం లేదు. ఇంటికిచ్చే కరెంట్ అయితే పొద్దంతా బుగ్గ వెలగడం లేదు. అప్పుడప్పుడు వస్తంది... మళ్లా పోతాంది.
- జాటోత్ వాగ్యానాయక్, జాజోత్ తండా, సంగెం
Advertisement