సూపర్ పవర్ | Super Power | Sakshi
Sakshi News home page

సూపర్ పవర్

Published Sat, Jun 7 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

సూపర్ పవర్

సూపర్ పవర్

  •      తెలంగాణలో విస్తరించనున్న కేటీపీపీ వెలుగులు
  •      మరో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కసరత్తు
  •      1,900 మెగావాట్లకు చేరుకోనున్న ప్లాంట్ సామర్థ్యం
  •      ఇదివరకే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన జెన్‌కో.. సమకూరిన నిధులు
  •      ప్రత్యేక దృష్టి సారించిన టీఆర్‌ఎస్ సర్కారు
  •      విద్యుత్ కొరత అధిగమించే దిశగా అడుగులు
  •  గణపురం, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ వెలుగులు విస్తరించనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా రానున్న రోజుల్లో విద్యుత్ కొరతను అధిగమించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్లాంట్లను పూర్తి చేయడం... లోటును పూడ్చుకునేందుకు మరిన్ని విద్యుత్ ప్లాంట్లను నిర్మించే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు.

    ఇందులో భాగంగా గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఇదివరకే శ్రీకారం చుట్టగా... అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే... మొత్తం 1900 మెగావాట్లతో కేటీపీపీ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రంగా అవతరించనుంది.
     
    ఏడాదిలో 1800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా..

    తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తొలి ప్రభుత్వానికి విద్యుత్ సమస్య సవాల్‌గా మారనుంది. తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ కొరత తీరాలంటే... ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న దాని కంటే మరో  2,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరం. ఈ మేరకు పరిస్థితి చక్కబడాలంటే  రెండు, మూడేళ్లపాటు లభ్యత ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయూల్సిందే.

    ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్లాంట్లపై టీఆర్‌ఎస్ సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో రెండో దశలో భాగంగా చేపట్టిన 600 మెగావాట్ల... సింగరేణి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న  1200 మెగావాట్లు విద్యుత్ ప్లాంట్లపై నజర్ వేసింది. పనులను  వేగవంతం చేసి... సంవత్సరం కాలంలో  18 వందల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

    ఇందులో భాగంగా... గురువారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో జెన్‌కో ఉన్నతస్థాయి అధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు. నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన పనులను వేగిరం చేయడంతోపాటు కేటీపీపీలో మరో  800 మెగావాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేయూలని ఆదేశించారు. ఈ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి జెన్‌కో, ప్రభుత్వం ఇదివరకే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతోపాటు సర్వే కూడా చేయించిన విషయం తెలిసిందే.

    యాష్ ఫాండ్, కోల్ డంప్‌యార్డ్, రిజర్వాయర్ ఏర్పాటు కోసం దుబ్బపల్లి  కొంపల్లి, మోరంచవాగు పరిసర ప్రాంతాలు అనువైనవిగా అధికారులు అప్పుడు గుర్తించారు. అవసరమైతే మరింత భూమిని ఇచ్చేందుకు ఆ ప్రాంత గ్రామాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చెల్పూరు శివారు దుబ్బపల్లిని మరో చోటుకు తరలించే క్రమంలో గ్రామం పరిసరాల్లోనే  సర్వే చేసిన 400 ఎకరాలు... మోరంచ, కొత్తపల్లి, కొంపెల్లి ప్రాంతాల్లో మరో 400 ఎకరాల భూములు అనుకూలంగా ఉన్నాయి.

    ఈ 800 ఎకరాలను  భూములను జెన్‌కో సేకరించడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన నిధులు సైతం సమకూరాయి. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రూ.4 వేల కోట్ల రూపాయలను సేకరించింది. నిధులు సమకూరడంతో ప్లాంట్ నిర్మాణానికి మార్గం సుగమం కాగా... రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో ప్లాంట్ నిర్మాణంలో జాప్యం జరిగింది.

    అయితే నూతన రాష్ట్రంలో ప్రస్తుత అవసరాలకు సరిపోను విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడం... రానున్న రోజుల్లో  మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశముండడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ మేరకు  కేసీఆర్ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాక ముందే భూపాలపల్లి ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు సిరికొండ మధుసూదనాచారి  పదిరోజుల క్రితం స్వయంగా కేటీపీపీకి వచ్చి అధికారులతో మాట్లాడారు.

    ప్లాంట్ విస్తరణకు ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలను వాకబు చేశారు. 600 మెగావాట్ల  ప్లాంట్ నిర్మాణ పరిస్థితి... మంజూరైన 800 మెగావాట్ల మూడో దశ యూనిట్  ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వసతులపై అధికారులతో చర్చించి ముఖ్యమంత్రి  కేసీఆర్‌కు  నివేదిక రూపంలో అందజేశారు. ఈ 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం జరిగితే...  1900 మెగావాట్లతో సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రంగా కేటీపీపీ అవతరించనుంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement