కారుచీకట్లో ‘కాంతి’రేఖలు
- సీలేరు బేస్‌లో 745 మెగావాట్ల విద్యుదుత్పత్తి
- రిజర్వాయర్‌లో పుష్కలంగా నీరు
- వెలుగులు నింపుతున్న విద్యుత్ కేంద్రాలు
సీలేరు: విద్యుత్ కొరతతో ఇక్కట్లు పడుతున్న రాష్ట్రంలో సీలేరు, డొంకరాయి, మోతుగూడెం (పొల్లూరు) విద్యుత్ కేంద్రాలు రాష్ట్రానికి నిరంతరం వెలుగులు ప్రసాదిస్తున్నాయి. గత 24 రోజులుగా పవర్ కెనాల్ మరమ్మతుల పేరిట పూర్తి స్థాయిలో నిలిచిపోయిన విద్యుదుత్పత్తి రెండు రోజులుగా తిరిగి ప్రారంభమైంది. అన్ని జల విద్యుత్ కేంద్రాల్లో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుదుత్పత్తి చేస్తూ 745 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి సరఫరా చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉక్కపోతతో విద్యుత్ సరఫరా లేక ప్రజలు అల్లాడుతున్న తరుణంలో భారీస్థాయిలో ఇంత విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ రాష్ట్రానికి సరఫరా చేస్తుండడంతో ప్రస్తుతం ఈ జలవిద్యుత్ కేంద్రాలు కీలకమయ్యాయి.
ఇక్కడ విద్యుదుత్పత్తి కోసం విడుదల చేసిన నీరు అనంతరం గోదావరి డెల్టాకు వెళ్లడంతో అక్కడ ఖరీఫ్ పంటకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం సీలేరు జల విద్యుత్ కేంద్రంలో 4 యూనిట్ల ద్వారా 260 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, డొంకరాయిలో ఒక యూనిట్ ద్వారా 25 మెగావాట్లు, మోతుగూడెం (పొల్లూరు)లో నాలుగు యూనిట్ల ద్వారా 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.
అంతే కాకుండా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నిర్మాణం చేపట్టిన మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో కూడా ప్రస్తుతం 6 యూనిట్లు పని చేస్తూ ఏపీకి 50 శాతం విద్యుత్ ఉత్పత్తి అందిస్తుంది. కాగా జోలాపుట్టు, బలిమెల, సీలేరు, డొంకరాయి రిజర్వాయర్‌లలో ప్రస్తుతం నీరు పుష్కలంగానే ఉంది.