కొత్త పరిశ్రమలకు విద్యుత్ ఎలా ఇస్తారు?
ఉత్పత్తి పెంచాకే పెట్టుబడుల కోసం యత్నించాలి
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు
కేయూ క్యాంపస్ : తెలంగాణ లో ప్రస్తుత పారిశ్రామిక అవసరాలతో పాటు రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వలేని రాష్ట్రప్రభుత్వం.. ఇతర దేశాల నుంచి పెట్టుబడుదారులు, పరిశ్రమలను ఆహ్వానిస్తోందని, వారు వస్తే విద్యుత్ ఎలా అందించగలుగుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు ప్రశ్నించారు. విద్యుత్ ఉత్పత్తిని పెంచితే తప్ప పెట్టుబడులు, పరిశ్రమలను ఆహ్వానించి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు.
తెలంగాణ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ‘టాక్ ఆన్ రోల్ ఆఫ్ యూత్ యాస్ ఇంటెలెక్చువల్స్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఇన్ తెలంగాణ’ అంశంపై వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో మురళీధర్‌రావు మాట్లాడుతూ.. దేశంలో గంగా నది తర్వాత పొడవైన గోదావరి తెలంగాణలోనే ఎక్కువగా ప్రవహిస్తోందని.. ఈ నది నీటిని సక్రమంగా వినియోగించుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీ అవసరమని అన్నారు. తెలంగాణ కేవలం ప్రాణత్యాగాలతోనే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాల ఎంపీలు పార్లమెంట్‌లో ఆమోదించడం వల్లే ఏర్పడిందని.. ఇప్పుడు బంగారు తెలంగాణ సాధనకు ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోవాల్సిన అవసరముందని సూచించారు. తాము ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకం కాదంటూనే.. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలే అధికారంలో కొనసాగుతున్నా అభివృద్ధి పెద్దగా సాధించలేదన్నారు.
ముఖ్య నగరం.. వరంగల్
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ ముఖ్యనగరమని.. దీనిని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాల్సిన అవసరముందని మురళీధర్‌రావు అన్నారు. సిద్ధాంత పరంగా అనేక సంవత్సరాలుగా సామాజిక సమస్యలపై స్పందించే చైతన్యం ఇక్కడి వాసులదన్నారు. ఇక తెలంగాణ అభివృద్ధి సాధించాలంటే డొమెస్టిక్ ఉత్పత్తులపై దృష్టి సారించాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా, తెలంగాణ ఐకాన్‌గా రాణి రుద్రమదేవిని పేర్కొంటూ.. ఆమె పోరాటపటిమను తెలంగాణ వ్యాప్తంగా విస్తరించేలా కృషిచేయాల్సి ఉందన్నారు. ఐఎంఏ జల్లా అధ్యక్షుడు ఎర్ర శ్రీధర్‌రాజు మాట్లాడుతూ యువత తమ శక్తిని విద్యారంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ రాణించాలన్నారు. కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకులు సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. సారంగపాణి మాట్లాడుతూ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇంటలెక్చువల్ ఫోరం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా వివిధ అంశాలను చర్చించేందుకు ఫోరం ద్వారా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. సదస్సులో వీవీఎస్.శర్మ, ప్రొఫెసర్ కె.రామానుజరావు, పెయింట్ పీటర్స్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్‌రెడ్డితో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, వివిధ సంఘాల బాధ్యులు సంపత్‌కుమార్, చందర్, కె.రవీందర్, వెంకటేశ్వర్‌రావు, పి.రఘోత్తంరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.