మహారాష్ట్రలో ఇన్నాళ్లూ కొనసాగిన రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ప్రభుత్వంలో చేరేందుకు శివసేన దాదాపుగా అంగీకారం తెలిపింది. మంత్రివర్గంలో మొత్తం 12 పదవులు తీసుకోడానికి తలూపినట్లు సమాచారం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఈ మేరకు సాగించిన చర్చల్లో అధికారాన్ని పంచుకోవడంపై ఓ ఒప్పందం కుదిరిందని శివసేన నాయకులు అంటున్నారు.
మొత్తం 12 పదవులు, వాటిలో 5 కేబినెట్, 7 సహాయ మంత్రి పదవులు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని చెబుతున్నారు. అయితే.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏఆర్ అంతూలే మరణించడంతో.. అధికారిక ప్రకటన మాత్రం కొంత ఆలస్యం అయ్యేలా ఉంది. దీంతో మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వానికి ఇప్పట్లో ఢోకా లేనట్లే. విశ్వాస పరీక్ష సమయానికి ఇంకా పదవుల పంపిణీపై అంగీకారం కుదరకపోవడంతో శివసేన సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. కానీ అప్పట్లో ఎన్సీపీ అండగా నిలబడటంతో సర్కారు గట్టెక్కింది. ఇప్పుడు ఎట్టకేలకు శివసేన ఓ మెట్టు దిగి రావడంతోసమస్యకు సానుకూల పరిష్కారం లభించినట్లయింది.
మహారాష్ట్ర ముసలానికి తెర పడినట్లేనా?
Published Tue, Dec 2 2014 6:04 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement