శనివారంలోగా చెప్పండి.. లేకుంటే అంతే: శివసేన
మహారాష్ట్రలో అధికారాన్ని పంచుకునే విషయమై శివసేన, బీజేపీల మధ్య ఇంకా ఓ అంగీకారం కుదరలేదు. తమ సొంత ప్రయోజనాలు కాపాడుకోడానికి ఒత్తిడి చేయాల్సిందేనని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే భావిస్తున్నారు. శనివారంలోగా శివసేన ఎమ్మెల్యేలను సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తన మంత్రివర్గంలోకి తీసుకోవాలని, లేనిపక్షంలో తాము ప్రభుత్వానికి మద్దతిచ్చే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని బీజేపీ అగ్రనేతలకు కూడా చెప్పినట్లు శివసేన వర్గాలు తెలిపాయి. అయితే... కమలనాథులు మాత్రం శివసేన ఒత్తిడికి ఏమాత్రం తలొగ్గే పరిస్థితి కనిపించడంలేదు.
తమకు ఉపముఖ్యమంత్రి పదవి, దాంతోపాటు మరో 10 మంత్రి పదవులు కావాలని శివసేన డిమాండు చేస్తోంది. ఒకవేళ ఉపముఖ్యమంత్రి అనే పదవే లేనిపక్షంలో మొత్తం 12 మంత్రి పదవులు ఇవ్వాలని, వాటిలో ఆరు కేబినెట్ స్థాయివి కావాలని అడుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప ముఖ్యమంత్రి పదవి ఉండబోదని, అలాగే మహా అయితే 8 మంత్రి పదవులు మాత్రమే ఇస్తామని బీజేపీ చెబుతున్నట్లు తెలుస్తోంది. వాటిలో నాలుగు కేబినెట్ పదవులు ఉంటాయంది.
ఈనెల 12వ తేదీన ఫడ్నవిస్ ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆలోగా తమకు ఎవరెవరు మిత్రపక్షాలో, ఎవరు కారో మాత్రం తేల్చుకోవాలి.