మిత్రులు మళ్లీ కలిశారు
‘మహా’ ప్రభుత్వంలో నేడు చేరనున్న శివసేన
5 కేబినెట్ పదవులు సహా
12 మంత్రి పదవులు
ముంబై: పాతికేళ్ల బంధం నిలిచింది. దాదాపు రెండు నెలల క్రితం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరక విడిపోయిన సైద్ధాంతిక సోదర పార్టీలు మళ్లీ కలిశాయి. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వంలో శివసేన చేరేందుకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. నేటి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అందుకు వేదిక కానుంది. శివసేన తమ ప్రభుత్వంలో చేరుతోందని, ఆ పార్టీకి ఐదు కేబినెట్ హోదాలు సహా మొత్తం 12 మంత్రి పదవులు ఇవ్వనున్నామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గురువారం ప్రకటించారు. అయితే, ఆ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోవడం లేదని, తన మంత్రివర్గంలో ఆ పదవి లేదని ఆయన తేల్చి చెప్పారు.
బీజేపీ నుంచి కొత్తగా 10 మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామన్నారు. శివసేన సీనియర్ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో ఫడ్నవిస్ పాల్గొన్నారు. శివసేన చేరడంతో ఫడ్నవిస్ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లభించినట్లైంది. అలాగే, డిసెంబర్ 8 నుంచి నాగపూర్‌లో ప్రారంభమవుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది. 288 సభ్యుల అసెంబ్లీలో బీజేపీకి 121 మంది సభ్యులు, శివసేనకు 63 మంది సభ్యులు ఉన్నారు. సీట్ల సర్దుబాటులో వైఫల్యంతో ఈ రెండు పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేయడం తెలిసిందే.
‘బీజేపీ, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకున్నారు. అందుకే కాంగ్రెస్, ఎన్సీపీలకు వ్యతిరేకంగా ఓటేశారు. రెండు పార్టీలు కలవాలనేదే ఎమ్మెల్యేలు, కార్యకర్తల అభీష్టం కూడా. అందుకే ప్రభుత్వంలో చేరాల్సిందిగా ఉద్ధవ్‌జీని కోరాను. ఆయన సానుకూలంగా స్పందించారు’ అని ఫడ్నవిస్ చెప్పారు. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే తమ రెండు పార్టీల లక్ష్యమని శివసేన సీనియర్ నేత సుభాష్ దేశాయి అన్నారు.
ప్రతిపక్ష నేత పదవి ఎవరికి?
మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన చేరుతుండటంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి విషయంలో కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య పోరు మొదలైంది. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 42 మంది, ఎన్సీపీకి 41 మంది సభ్యులు ఉన్నారు. అయితే, ఎన్నికల ముందు తమతో పొత్తు పెట్టుకున్న బహుజన వికాస్ అగధి పార్టీకి ఉన్న మూడు స్థానాలు, తమకు మద్ధతిస్తున్న ఒక స్వతంత్ర ఎమ్మెల్యేలను కలుపుకుంటే తమ సభ్యుల సంఖ్య 45కు చేరుతుంది కాబట్టి ప్రతిపక్ష నేత హోదా తమకే ఇవ్వాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తోంది.