
కిరాయిదారులకు ఊరట.. సబ్సిడీ అమలు!
త్వరలో జరగనున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నగరంలో అద్దెకు ఉండే మధ్యతరగతి జీవులపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ వరాల జల్లు కురిపించారు. ఇప్పటివరకు అమలుచేస్తున్న విద్యుత్ సబ్సిడీ పథకాన్ని ఇకనుంచి ఇళ్ల కిరాయిదారులకు కూడా అమలుచేయనున్నట్టు ఆయన ఆదివారం ప్రకటించారు. అత్యంత కీలకమైన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పాగా వేసి మరోసారి సత్తా చాటాలని కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఢిల్లీలోని సౌత్, నార్త్, ఈస్ట్ మున్సిపల్ కార్పొరేషన్లు బీజేపీ చేతిలో ఉన్నాయి. ఈ మూడింటిలోనూ అధికారం కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆప్.. ప్రధానంగా తన ఓటుబ్యాంకు అయిన మధ్యతరగతి ప్రజలపై దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో నివాస గృహాల ఆస్తి పన్ను చెల్లింపును రద్దుచేసిన సీఎం కేజ్రీవాల్.. ఇకనుంచి ఢిల్లీలో ఉండే కిరాయిదారులకు కూడా విద్యుత్ సబ్సిడీ పథకాన్ని అమలుచేయబోతున్నట్టు ట్విట్టర్‌లో తెలిపారు.