ఖాళీల భర్తీ ఎప్పుడో | Would fill the gaps | Sakshi
Sakshi News home page

ఖాళీల భర్తీ ఎప్పుడో

Published Wed, Jul 6 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM

Would fill the gaps

రెండేళ్లయినా భర్తీ లేదు
ఉప ఎన్నికల కోసం నిరీక్షణ

 
 
నూజివీడు: పంచాయతీలలో వివిధ కారణాలతో ఖాళీ అయిన పదవుల భర్తీ ప్రశ్నార్ధకరంగా తయారైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే ఇక్కడ ఎన్నికలను కూడా సరైన సమయానికి నిర్వహించుకోలేని దౌర్భాగ్య పరిస్థితులలో ప్రభుత్వం ఉండటం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి చనిపోయినా, పదవి నుంచి వైదొలగినా తిరిగి ఆరునెలలోగా ఉప ఎన్నిక  నిర్వహించాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి బలం పెరుగడటంతో పాటు స్థానిక సంస్థలకు కూడా అధిక ప్రాధాన్యతనిచ్చినట్లవుతుంది.  ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదు. పంచాయతీ ఎన్నికలు 2013వ సంవత్సరం జులై నెలలో జరిగాయి. ఆ తరువాత కొన్నిచోట్ల సర్పంచులు తమ పదవులకు రాజీనామా చేయడం, మరికొన్ని చోట్ల చనిపోవడం, వార్డు సభ్యులు కూడా రాజీనామా చేయడం, చనిపోవడం జరిగింది. ఇవి జరిగి రెండేళ్లవుతున్నా పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు గాని, ప్రభుత్వం గాని పట్టించుకోకుండా స్థానిక సంస్థలను గాలికొదిలేసింది.

 
33వార్డు సభ్యులు, 4 సర్పంచి పదవులు ఖాళీ నూజివీడు డివిజన్‌లోని 14మండలాల్లో కలిపి 33 వార్డుసభ్యుల పదవులు, నాలుగు సర్పంచి పదవులు,  ఆరు ఉపసర్పంచి పదవులు ఖాళీగా ఉన్నాయి.  బాపులపాడు మండలం  రేమల్లె, గంపలగూడెం మండలం వినగడప, గన్నవరం మండలం బూతిమిల్లిపాడు, ఉంగుటూరు మండలం ఉంగుటూరు సర్పంచి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఉంగుటూరు సర్పంచి రాజీనామా చేయగా, మిగిలిన పంచాయతీల సర్పంచిలు చనిపోవడంతో ఖాళీ అయ్యాయి. ఏ కొండూరు మండలం చీమలపాడు, ఆగిరిపల్లి మండలం గొల్లగూడెం, బాపులపాడు మండలం రంగన్నగూడెం, గంపలగూడెం మండలం కొనిజర్ల,  గాదెవారిగూడెం, ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లి పంచాయతీల ఉపసర్పంచిల పదవులు ఖాళీగా ఉన్నాయి. వార్డు సభ్యుల పదవులకు సంబంధించి ఏ కొండూరు, ఆగిరిపల్లి, చాట్రాయి, గన్నవరం, ముసునూరు, పమిడిముక్కల మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున, బాపులపాడు మండలంలో 3, గంపలగూడెంలో 6, నూజివీడులో 4, తిరువూరులో 5, ఉంగుటూరులో 3, విస్సన్నపేటలో 3, ఉయ్యూరులో  2 చొప్పున ఖాళీగా ఉన్నాయి. ఈ పదవులు దాదాపు రెండేళ్లుగా ఉన్నా ఎన్నికలు నిర్వహించకపోవడం దారుణమని పలు రాజకీయ పార్టీల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.


బాపులపాడు మండలం రేమల్లె సర్పంచి 2015 ఫిబ్రవరి 7వ తేదీన మరణించారు. గంపలగూడెం మండలం వినగడప సర్పంచి 2015 ఆగస్టు 8వ తేదీన, గన్నవరం మండలం బూతిమిల్లిపాడు సర్పంచి 2014 మే 29న చనిపోయారు. ఇలా సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేయడం గమనర్హం. ఇప్పటికైనా  ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement