Tirupati assembly position
-
తిరుపతి టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ
తిరుపతి: దివంగత ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ భార్య ఎం.సుగుణమ్మను తిరుపతి శాసనసభస్థానం టీడీపీ అభ్యర్థిగా పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రకటించారు. నారావారిపల్లిలో తన ఇంట్లో టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. నేతల అభిప్రాయాలను తెలుసుకున్న చంద్రబాబు సమావేశం అనంతరం సుగుణమ్మను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. తిరుపతి శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలును విడుదల చేసిన విషయం విదితమే. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 19న ప్రారంభమమై 27న ముగుస్తుంది. ఈనెల 30లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఫిబ్రవరి 13న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు చేపట్టేలా షెడ్యూలును విడుదల చేశారు. సొంతూర్లో సంక్రాంతి పండుగ జరుపుకోవాలన్న భావనతో నారావారిపల్లికి చేరుకున్న చంద్రబాబు బుధవారం రాత్రి టీడీపీ జిల్లా కన్వీనర్ గౌనివారి శ్రీనివాసులు, దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ భార్య ఎం.సుగుణమ్మ, కుటుంబ సభ్యులు, టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలను నారావారిపల్లిలోని తన ఇంటికి పిలిపించుకుని సమావేశమయ్యారు. తిరుపతి ఉప ఎన్నిక, జిల్లాలో టీడీపీ స్థితిగతులపై ఆరా తీశారు. సమావేశంలో నేతల అభిప్రాయాలను తీసుకున్న చంద్రబాబు.. తిరుపతి టీడీపీ అభ్యర్థిగా ఎం.సుగుణమ్మ పేరును ప్రకటించారు. టీడీపీ అభ్యర్థిగా తనను ప్రకటించిన అనంతరం ఎం.సుగుణమ్మ విలేకరులతో మాట్లాడుతూ భర్త వెంకటరమణ ఆశయాల సాధన కోసం పని చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానన్నారు. టీడీపీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకరించాలని అన్ని రాజకీయపార్టీల నేతలను కోరుతామని చెప్పారు. -
సంబరాలకు సీఎం దూరం?
తిరుపతి ఉప ఎన్నిక షెడ్యూలుతో జిల్లా వ్యాప్తంగా అమల్లోకి కోడ్ చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీకి కోడ్ నుంచి మినహాయింపు తిరుపతి: తిరుపతి శాసనసభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల చేయడంతో సోమవారం సాయంత్రం నుంచి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిల్పారామంలో మంగళవారం నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనకపోవచ్చని సమాచారం. చంద్రన్న సంక్రాంతి కానుక పథకాన్ని రెండు రోజుల క్రితమే ప్రారంభించిన నేపథ్యంలో.. ఆ పథకం పంపిణికీ కోడ్ నుంచి మినహాయింపును ఇచ్చింది. కానీ.. ప్రజాప్రతినిధులు, రాజకీయపార్టీల నేతలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనకూడదు. తిరుపతిలో మంగళవారం నిర్వహించే సం కాంత్రి సంబరాలకు బాబు దూరంగా ఉంటారని తెలిసింది. ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో తిరుపతి శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల చేయడంతో సోమవారం నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ముందే నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం సీఎం చంద్రబాబు మంగళవారం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాల్సి ఉంది. విశాఖపట్నం, విజయవాడ పర్యటనలు ముగించుకుని.. సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి తిరుపతిలో పర్యటించాలని చంద్రబాబు భావించారు. విజయవాడ నుంచి మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని.. ఆతర్వాత అర్బన్‌హాట్‌లో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలని నిర్ణయించారు. సంబరాలు ముగిసిన తర్వాత గ్రాండ్ రిడ్జ్ హోటల్లో జిల్లాలో పారిశ్రామికవేత్తలతో సమావేశమై.. రాత్రికి సొంతూరు నారావారిపల్లికి చేరుకోవాలని భావించారు. నారావారిపల్లిలో సంక్రాంతి పండుగ చేసుకుని.. 15న నేరుగా ఢిల్లీకి వెళ్లేలా పర్యటనను రూపొందించుకున్నారు. కానీ.. సోమవారం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మంగళవారం తిరుపతి అర్బన్‌హాట్‌లో నిర్వహించే సంక్రాంతి సంబరాలకూ.. గ్రాండ్ రిడ్జ్‌లో నిర్వహించే పారిశ్రామికవేత్తల సమావేశాలకు సీఎం దూరంగా ఉంటారని సమాచారం. విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమలకు వెళ్లి.. శ్రీవారిని దర్శించుకుని నారావారిపల్లికి చేరుకుంటారని తెలిసింది. ముఖ్యమంత్రి శిల్పారామంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారా లేదా అనే సమాచారం కోసం కలెక్టర్‌ను సంప్రదించగా ఆయన స్పందించకపోవడం గమనార్హం. -
తిరుపతి ఉప ఎన్నికకు మోగిన నగారా
షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం 19న నోటిఫికేషన్.. అదే రోజున నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి 13న పోలింగ్.. 16న ఓట్ల లెక్కింపు, ఫలితం ప్రకటన జిల్లాలో అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్ తిరుపతి: తిరుపతి శాసనసభ స్థానం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తెరతీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వీఎస్ సంపత్ సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈనెల 19న జారీచేయనున్నారు. అదే రోజున నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 27 తుదిగడువు. ఈనెల 30 మధ్యాహ్నం మూడు గంటల్లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఫిబ్రవరి 13న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. ఈవీఎంల్లో పోలైన ఓట్లను ఫిబ్రవరి 16న లెక్కించి.. ఫలితాన్ని ప్రకటిస్తారు. వివరాల్లోకి వెళితే.. సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు ఎం.వెంకటరమణ కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. తిరుపతి శాసనసభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసివిజయం సాధించారు. అనారోగ్యం బారిన పడిన వెంకటరమణ డిసెంబర్ 15న చెన్నైలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వెంకటరమణ మృతితో ఖాళీ అయిన తిరుపతి శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ అంటే ఫిబ్రవరి 19 వరకూ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించుతారన్నది చర్చనీయాంశంగా మారింది. దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ భార్య ఎం.సుగుణను బరిలోకి దించుతారా..? వారి కుటుంబ సభ్యుల్లో మరొకరిని పోటీకి దించుతారా..? ఇతరులను బరిలోకి దించుతారా...? అన్నది తేలాల్సి ఉంది. అభ్యర్థిత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయంపైనే ఉప ఎన్నిక ఆధారపడి ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.