సంబరాలకు సీఎం దూరం?
తిరుపతి ఉప ఎన్నిక షెడ్యూలుతో జిల్లా వ్యాప్తంగా అమల్లోకి కోడ్
చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీకి కోడ్ నుంచి మినహాయింపు
తిరుపతి: తిరుపతి శాసనసభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల చేయడంతో సోమవారం సాయంత్రం నుంచి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిల్పారామంలో మంగళవారం నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనకపోవచ్చని సమాచారం. చంద్రన్న సంక్రాంతి కానుక పథకాన్ని రెండు రోజుల క్రితమే ప్రారంభించిన నేపథ్యంలో.. ఆ పథకం పంపిణికీ కోడ్ నుంచి మినహాయింపును ఇచ్చింది. కానీ.. ప్రజాప్రతినిధులు, రాజకీయపార్టీల నేతలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనకూడదు. తిరుపతిలో మంగళవారం నిర్వహించే సం కాంత్రి సంబరాలకు బాబు దూరంగా ఉంటారని తెలిసింది. ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో తిరుపతి శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల చేయడంతో సోమవారం నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ముందే నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం సీఎం చంద్రబాబు మంగళవారం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాల్సి ఉంది.
విశాఖపట్నం, విజయవాడ పర్యటనలు ముగించుకుని.. సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి తిరుపతిలో పర్యటించాలని చంద్రబాబు భావించారు. విజయవాడ నుంచి మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని.. ఆతర్వాత అర్బన్‌హాట్‌లో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలని నిర్ణయించారు. సంబరాలు ముగిసిన తర్వాత గ్రాండ్ రిడ్జ్ హోటల్‌లో జిల్లాలో పారిశ్రామికవేత్తలతో సమావేశమై.. రాత్రికి సొంతూరు నారావారిపల్లికి చేరుకోవాలని భావించారు. నారావారిపల్లిలో సంక్రాంతి పండుగ చేసుకుని.. 15న నేరుగా ఢిల్లీకి వెళ్లేలా పర్యటనను రూపొందించుకున్నారు. కానీ.. సోమవారం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మంగళవారం తిరుపతి అర్బన్‌హాట్‌లో నిర్వహించే సంక్రాంతి సంబరాలకూ.. గ్రాండ్ రిడ్జ్‌లో నిర్వహించే పారిశ్రామికవేత్తల సమావేశాలకు సీఎం దూరంగా ఉంటారని సమాచారం. విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమలకు వెళ్లి.. శ్రీవారిని దర్శించుకుని నారావారిపల్లికి చేరుకుంటారని తెలిసింది. ముఖ్యమంత్రి శిల్పారామంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారా లేదా అనే సమాచారం కోసం కలెక్టర్‌ను సంప్రదించగా ఆయన స్పందించకపోవడం గమనార్హం.