ఏపీలో 8, తెలంగాణలో 3
మండలి స్థానాలపై ఈసీకి సీఈఓ భన్వర్‌లాల్ ప్రతిపాదనలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి స్థానాలను 50 నుంచి 58కి పెంచేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) ప్రతిపాదనలు పంపారు. తెలంగాణ మండలిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీల సంఖ్యను మూడుకు పెంచేందుకు ప్రతిపాదనలు పంపారు. ఈ పెంపుపై కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో పాటు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆ మేరకు సవరణలు తీసుకురావాల్సి ఉంటుంది. ఏపీలో ప్రస్తుతం శాసనసభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, అలాగే స్థానిక సంస్థలు ఎక్కువగా ఉన్నందున ఆ మేరకు ఎమ్మెల్సీల సంఖ్యను పెంచేందుకు వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణలో ప్రస్తుతం శాసనసభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నందున ఎమ్మెల్సీ స్థానాలను 40కి మించి పెంచడం సాధ్యం కాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ మండలిలో స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ప్రస్తుతం 20 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అయితే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్ట ప్రకారం స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీల సంఖ్య 17 మాత్రమే ఉండాలి.
అయితే స్థానిక సంస్థలు ఎక్కువగా ఉన్నందున.. ఆ సంఖ్యను ఇప్పుడు మరో మూడుకు పెంచేందుకు వీలుగా భన్వర్‌లాల్ ఈసీకి ప్రతిపాదనలు పంపారు. అలాగే ‘ఎమ్మెల్యే’ స్థానాల సంఖ్యను కూడా మరో మూడు పెంచేందుకు, అలాగే పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి చెరొక స్థానం చొప్పున పెంచేందుకు ప్రతిపాదనలు పంపారు. ఈ పెంపుతో ఏపీ శాసన మండలిలో ఎమ్మెల్సీ స్థానాల సంఖ్య 58కి పెరుగుతుంది. ఇక తెలంగాణ శాసనమండలిలో 14 మంది ‘స్థానిక’ ఎమ్మెల్సీలుండాలని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం 11 మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో మూడు ‘స్థానిక’ స్థానాలను పెంచాల్సిందిగా సీఈఓ ప్రతిపాదించారు. ఇందుకు ఆమోదం లభిస్తే తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీల సంఖ్య 40కి చేరుతుంది.