‘వైఎస్సార్‌సీపీ’ ఇక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ
వైఎస్సార్‌సీపీకి ఫ్యాన్ గుర్తు రిజర్వ్ చేసిన ఈసీ
ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందిన మూడో రాష్ట్ర పార్టీగా అవతరణ
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల మేరకు లభించిన గుర్తింపు
రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇక లాంఛనమే
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇటీవలి లోక్‌సభ, శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి లభించిన ఓట్లను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌ను రాష్ట్ర పార్టీగా గుర్తించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం జారీ చేసిన ఆదేశాల్లో (నం.56/రివ్యూ/2013/పీపీ-2) పేర్కొంది. ఇప్పటివరకు కేవలం రిజిస్టర్డ్ పార్టీగా మాత్రమే ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల చట్టంలోని గుర్తులు (రిజర్వేషన్, కేటాయింపు) ఆర్డర్ 1968 నిర్దేశించిన విధివిధానాలన్నింటినీ పూర్తి చేసిందని, అందువల్ల ఇకనుంచి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర పార్టీగా గుర్తింపును ఇచ్చినట్టు ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ శర్మ పేరుతో జారీ అయిన ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతోపాటు పార్టీ అభ్యర్థన మేరకు సీలింగ్ ఫ్యాన్ గుర్తును వైఎస్సార్ కాంగ్రెస్‌కు రిజర్వ్ చేసినట్టు ఆ ఆదేశాల్లో తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన ఆదేశాలను తన వెబ్‌సైట్‌లో పెట్టడమే కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పంపారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లో ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్న సీలింగ్ ఫ్యాన్ గుర్తును తొలగిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తాజా ఆదేశాలతో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందిన పార్టీల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు టీడీపీ, టీఆర్‌ఎస్‌లు మాత్రమే ఉన్నాయి.
తాజా ఆదేశాలతో రాష్ట్ర పార్టీల జాబితాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా చేరింది. అయితే నిబంధనల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఆ పార్టీ నాయకులు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను కలసి గుర్తింపు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు పత్రాన్ని దరఖాస్తుతోపాటు జత చేయనున్నారు. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు రావడం ఇక లాంఛనప్రాయమే కానుంది. తాజా పరిణామాల ఫలితంగా వైఎస్సార్ కాంగ్రెస్ గుర్తింపు పొందిన పార్టీ కానందున అందులోంచి వేరే పార్టీల్లోకి వెళ్లే ప్రజాప్రతినిధులకు ఫిరాయింపుల చట్టం వర్తించదంటూ దుష్ర్పచారం సాగిస్తున్న టీడీపీ నేతల నోటికి తాళం పడినట్లయింది. త్వరలో జెడ్పీ, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఎవరైనా తమ పార్టీ ఇచ్చే విప్‌ను ధిక్కరించే పక్షంలో వారిపై అనర్హత వేటు పడనుంది.