స్థానిక ఎమ్మెల్సీ స్థానాలను పునర్విభజించాలి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలంటే.. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆ స్థానాలను పునర్విభజన చేయాల్సి ఉందని రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కూడా భన్వర్‌లాల్ ప్రత్యేక నోట్ పంపారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం స్థానిక సంస్థల నియోజకవర్గాల సంఖ్య ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 17 మాత్రమే ఉండాలని.. ప్రస్తుతం 20 ఎమ్మెల్సీ స్థానాలున్నందున మూడు స్థానాలను తగ్గించాల్సి ఉందని భన్వర్‌లాల్ ఏపీ సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావుకు పంపిన నోట్‌లో పేర్కొన్నారు. ఈ తగ్గింపును జనాభా ప్రాతిపదికన కేంద్ర ఎన్నికల కమిషన్ చేయాల్సి ఉన్నందున... ఈ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌నే సంప్రదించాల్సిందిగా సూచించారు. అలాగే రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ శాసనమండలిలో స్థానిక నియోజకవర్గాల సంఖ్య 14 ఉండాలని.. అయితే ప్రస్తుతం 11 మాత్రమే ఉన్నందున.. మూడు స్థానాలను పెంచాల్సి ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్‌తో పాటు తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మకు సీఈఓ భన్వర్‌లాల్ నోట్ పంపారు. జనాభా ప్రాతిపదికన స్థానాల సంఖ్య పెంపు కేంద్ర ఎన్నికల కమిషన్ చేయాల్సి ఉన్నందున.. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. రాజ్యాంగంలోని మూడో అధికరణ కింద రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం వచ్చినందున గతంలో శాసనమండలి ఏర్పాటు చేస్తూ చేసిన చట్టంలో పేర్కొన్న ఎమ్మెల్సీ స్థానాల సంఖ్య ఇప్పుడు అమల్లో ఉండదు. గత చట్టాలన్నింటినీ రాజ్యాంగంలోని 3వ అధికరణ కింద చేసిన రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం అధిగమిస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు నిర్వహించాలంటే రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న సంఖ్య మేరకు ఆ స్థానాల పునర్విభజన చేయాల్సి ఉంది.
‘స్థానిక’ ప్రజాప్రతినధిలూ ప్రమాణం చేశాకే...
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో స్థానిక నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల్లో 11 ఖాళీగా ఉన్నాయి. ఇందులో మూడు స్థానాలను తగ్గించాల్సి ఉంది. ఈ తగ్గింపు చేసిన తరువాతనే మిగతా ఖాళీగా ఉన్న 8 స్థానాల్లో స్థానిక ఎమ్మెల్సీలకు ఎన్నికలు నిర్వహించడానికి వీలవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ‘సాక్షి’కి తెలిపారు. అలాగే.. తెలంగాణ శాసనమండలిలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు రెండు ఖాళీగా ఉండగా.. కొత్తగా మూడు స్థానాలను పెంచాల్సి ఉందని.. ఈ మూడు స్థానాలను పెంచిన తరువాత మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పునర్విభజనతో పాటు స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో 70 శాతం మంది బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేస్తే గానీ స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎంత మంది ప్రమాణ స్వీకారం చేశారో వివరాలు పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్లను కోరుతున్నామని తెలిపారు.
తగ్గేది ఎక్కడ? పెరిగేది ఎక్కడ?
రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి స్థానిక నియోజకవర్గాల స్థానాల్లో మూడు స్థానాలు తగ్గించడం జనాభా ప్రాతిపదికన చేస్తారు. 2011 జనాభా ప్రాతిపదికన చూస్తే ఏపీ శాసనమండలి స్థానిక నియోజవర్గాల్లో.. కృష్ణా, విశాఖ, చిత్తూరు జిల్లాల్లో రెండేసి స్థానాలు చొప్పున ఉండగా.. వాటిని ఒక్కొక్క స్థానానికి తగ్గించనున్నారు. తెలంగాణ శాసనమండలి స్థానాల పెంపును కూడా ఆయా జిల్లాల జనాభా ఆధారంగా చేయనున్నారు. దాని ప్రకారం చూస్తే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కో స్థానిక నియోజవర్గం చొప్పున మూడు స్థానాలు పెరగనున్నట్లు అధికార వర్గాల సమాచారం.
8 స్థానాల పెంపు కోరనున్న ఏపీ
ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యుల సంఖ్యను మరో 8 పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాయనుంది. ప్రస్తుతం రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ మండలికి 50 స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 175 మంది శాసనసభ్యులు ఉన్నందున ఆ నిష్పత్తిలో గరిష్టంగా కౌన్సిల్‌లో 58 స్థానాలు ఉండొచ్చు. ఇదే విషయంపై ఆర్థికమంత్రి యనమల బుధవారం మీడియాతో మాట్లాడుతూ మరో 8 స్థానాలు పెంచాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాయనున్నట్టు చెప్పారు.