reorganise
-
హెచ్డీఎఫ్సీ లైఫ్ జోరు- మదర్సన్ డీలా
మార్కెట్ల ప్రధాన ఇండెక్సులలో ఒకటైన నిఫ్టీ-50లో చోటు సాధించనుండటంతో ప్రయివేట్ రంగ కంపెనీ హెచ్డీఎఫ్సీ లైఫ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క బిజినెస్ పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు వెల్లడించడంతో ఆటో విడిభాగాల దిగ్గజం మదర్సన్ సుమీ సిస్టమ్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. మదర్సన్ సుమీ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ నెలాఖరు(31) నుంచీ ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ-50లో హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్‌కు చోటు లభించనుంది. స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్‌కానున్న వేదాంతా లిమిటెడ్ స్థానంలో హెచ్డీఎఫ్సీ లైఫ్‌కు చోటు సాధిస్తోంది. నిఫ్టీ ఇతర ఇండెక్సులలో ఎస్బీఐ కార్డ్స్ పేమెంట్స్ షేరు వేదాంతా ను రీప్లేస్ చేయనున్నట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. మెటల్ ఇండెక్స్‌లో మాత్రం వేదాంతా స్థానే పీఎస్‌యూ మిధానీ చోటు సంపాదించనుంది. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ లైఫ్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 4.4 శాతం జంప్‌చేసి రూ. 572 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 576 వరకూ ఎగసింది. మదర్సన్ సుమీ సిస్టమ్స్ వ్యవస్థాగత పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు ఆటో విడిభాగాల దిగ్గజం మదర్సన్ సుమీ సిస్టమ్స్ తాజాగా ప్రకటించింది. దీనిలో భాగంగా దేశీ వైరింగ్, హారన్ బిజినెస్‌ను అనుబంధ సంస్థగా విడదీయనున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో సంవర్ధన మదర్సన్ ఆటోమోటివ్ సిస్టమ్స్‌ను విలీనం చేసుకోనున్నట్లు పేర్కొంది. తదుపరి కాలంలో వైరింగ్ బిజినెస్ కలిగిన కంపెనీని స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో మదర్సన్ సుమీ కౌంటర్ బలహీనపడింది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.5 శాతం పతనమై రూ. 98 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 94 వరకూ తిరోగమించింది. -
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో తగ్గనున్న టాటా వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో టాటా గ్రూప్ ప్రతిపాదిత వాటా కొనుగోలు డీల్‌ను పునర్వ్యవస్థీకరించినట్టు సమాచారం. నియంత్రణ పరమైన అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో టాటా గ్రూప్ నేతృత్వంలోని మూడు సంస్థలు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో 44.4 శాతం వాటాను రూ.8,500 కోట్లకు కొనుగోలు చేసేందుకు జీఎంఆర్‌తో డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. వాస్తవ ప్రణాళిక ప్రకారం జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో టాటా గ్రూప్ 19.7%, సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ జీఐసీ ప్రైవేట్ లిమిటెడ్ 14.8%, హాంకాంగ్‌కు చెందిన ఎస్ఎస్జీ క్యాపిటల్ 9.9% వాటాను దక్కించుకోవాలి. నూతన ప్రణాళిక ప్రకారం టాటాల వాటా 14.7%కి పరిమితం కానుంది. జీఐసీ వాటా 5 శాతం పెరిగి 19.8%కి చేరనుంది. ఎస్ఎస్జీ వాటాలో ఎటువంటి మార్పు లేకుండా 9.9% ఉండనుంది. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ అనుబంధ కంపెనీ అయిన ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌లో టాటా గ్రూప్ వాటా డీల్ పునర్వ్యవస్థీకరణ తర్వాత నికరంగా 10 శాతానికి చేరుతుంది. ఇదీ నేపథ్యం..: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో టాటా గ్రూప్ వాటా కొనుగోలు విషయమై న్యాయపర అంశాలపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొద్ది రోజుల క్రితం సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అభిప్రాయాన్ని కోరింది. ఎయిర్పోర్ట్ ఆపరేటింగ్ కంపెనీల్లో దేశీయ ఎయిర్‌లైన్ సంస్థల వాటా 10 శాతంలోపే ఉండాలన్న పరిమితి ఉంది. టాటా గ్రూప్.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యంతో పూర్తిస్థాయి సర్వీస్ క్యారియర్ ‘విస్తారా ఎయిర్‌లైన్స్’, మలేషియాకు చెందిన ఎయిర్ ఆసియా బెర్హడ్‌తో కలిసి బడ్జెట్ ఎయిర్‌లైన్ ‘ఎయిర్ఆసియా ఇండియా’ను నిర్వహిస్తోంది. ఈ రెండు సంస్థల్లోనూ టాటా గ్రూప్‌నకు 51 శాతం వాటా ఉంది. కాగా, డీల్ తదనంతరం జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని అనుబంధ సంస్థల వాటా 53.5 శాతంగా ఉంటుంది. కంపెనీ ఎంప్లాయీ వెల్ఫేర్ ట్రస్ట్‌కు 2.1 శాతం వాటా ఉంది. ఎయిర్‌పోర్టుల నిర్వహణ బాధ్యత జీఎంఆర్ చేతిలోనే ఉండనుంది. డీల్‌తో జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుణం రూ.12,000 కోట్లకు వచ్చి చేరుతుంది. -
స్థానిక ఎమ్మెల్సీ స్థానాలను పునర్విభజించాలి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలంటే.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆ స్థానాలను పునర్విభజన చేయాల్సి ఉందని రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కూడా భన్వర్‌లాల్ ప్రత్యేక నోట్ పంపారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం స్థానిక సంస్థల నియోజకవర్గాల సంఖ్య ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 17 మాత్రమే ఉండాలని.. ప్రస్తుతం 20 ఎమ్మెల్సీ స్థానాలున్నందున మూడు స్థానాలను తగ్గించాల్సి ఉందని భన్వర్‌లాల్ ఏపీ సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావుకు పంపిన నోట్లో పేర్కొన్నారు. ఈ తగ్గింపును జనాభా ప్రాతిపదికన కేంద్ర ఎన్నికల కమిషన్ చేయాల్సి ఉన్నందున... ఈ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్నే సంప్రదించాల్సిందిగా సూచించారు. అలాగే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ శాసనమండలిలో స్థానిక నియోజకవర్గాల సంఖ్య 14 ఉండాలని.. అయితే ప్రస్తుతం 11 మాత్రమే ఉన్నందున.. మూడు స్థానాలను పెంచాల్సి ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్‌తో పాటు తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మకు సీఈఓ భన్వర్‌లాల్ నోట్ పంపారు. జనాభా ప్రాతిపదికన స్థానాల సంఖ్య పెంపు కేంద్ర ఎన్నికల కమిషన్ చేయాల్సి ఉన్నందున.. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. రాజ్యాంగంలోని మూడో అధికరణ కింద రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చినందున గతంలో శాసనమండలి ఏర్పాటు చేస్తూ చేసిన చట్టంలో పేర్కొన్న ఎమ్మెల్సీ స్థానాల సంఖ్య ఇప్పుడు అమల్లో ఉండదు. గత చట్టాలన్నింటినీ రాజ్యాంగంలోని 3వ అధికరణ కింద చేసిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం అధిగమిస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు నిర్వహించాలంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న సంఖ్య మేరకు ఆ స్థానాల పునర్విభజన చేయాల్సి ఉంది. ‘స్థానిక’ ప్రజాప్రతినధిలూ ప్రమాణం చేశాకే... ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో స్థానిక నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల్లో 11 ఖాళీగా ఉన్నాయి. ఇందులో మూడు స్థానాలను తగ్గించాల్సి ఉంది. ఈ తగ్గింపు చేసిన తరువాతనే మిగతా ఖాళీగా ఉన్న 8 స్థానాల్లో స్థానిక ఎమ్మెల్సీలకు ఎన్నికలు నిర్వహించడానికి వీలవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ‘సాక్షి’కి తెలిపారు. అలాగే.. తెలంగాణ శాసనమండలిలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు రెండు ఖాళీగా ఉండగా.. కొత్తగా మూడు స్థానాలను పెంచాల్సి ఉందని.. ఈ మూడు స్థానాలను పెంచిన తరువాత మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పునర్విభజనతో పాటు స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో 70 శాతం మంది బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేస్తే గానీ స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎంత మంది ప్రమాణ స్వీకారం చేశారో వివరాలు పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్లను కోరుతున్నామని తెలిపారు. తగ్గేది ఎక్కడ? పెరిగేది ఎక్కడ? రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి స్థానిక నియోజకవర్గాల స్థానాల్లో మూడు స్థానాలు తగ్గించడం జనాభా ప్రాతిపదికన చేస్తారు. 2011 జనాభా ప్రాతిపదికన చూస్తే ఏపీ శాసనమండలి స్థానిక నియోజవర్గాల్లో.. కృష్ణా, విశాఖ, చిత్తూరు జిల్లాల్లో రెండేసి స్థానాలు చొప్పున ఉండగా.. వాటిని ఒక్కొక్క స్థానానికి తగ్గించనున్నారు. తెలంగాణ శాసనమండలి స్థానాల పెంపును కూడా ఆయా జిల్లాల జనాభా ఆధారంగా చేయనున్నారు. దాని ప్రకారం చూస్తే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కో స్థానిక నియోజవర్గం చొప్పున మూడు స్థానాలు పెరగనున్నట్లు అధికార వర్గాల సమాచారం. 8 స్థానాల పెంపు కోరనున్న ఏపీ ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యుల సంఖ్యను మరో 8 పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాయనుంది. ప్రస్తుతం రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ మండలికి 50 స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 175 మంది శాసనసభ్యులు ఉన్నందున ఆ నిష్పత్తిలో గరిష్టంగా కౌన్సిల్లో 58 స్థానాలు ఉండొచ్చు. ఇదే విషయంపై ఆర్థికమంత్రి యనమల బుధవారం మీడియాతో మాట్లాడుతూ మరో 8 స్థానాలు పెంచాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాయనున్నట్టు చెప్పారు.