మార్కెట్ల ప్రధాన ఇండెక్సులలో ఒకటైన నిఫ్టీ-50లో చోటు సాధించనుండటంతో ప్రయివేట్ రంగ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క బిజినెస్ పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు వెల్లడించడంతో ఆటో విడిభాగాల దిగ్గజం మదర్‌సన్ సుమీ సిస్టమ్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. మదర్‌సన్ సుమీ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం..
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్
ఈ నెలాఖరు(31) నుంచీ ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ-50లో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్‌కు చోటు లభించనుంది. స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్‌కానున్న వేదాంతా లిమిటెడ్ స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌కు చోటు సాధిస్తోంది. నిఫ్టీ ఇతర ఇండెక్సులలో ఎస్‌బీఐ కార్డ్స్ పేమెంట్స్ షేరు వేదాంతా ను రీప్లేస్ చేయనున్నట్లు ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. మెటల్ ఇండెక్స్‌లో మాత్రం వేదాంతా స్థానే పీఎస్‌యూ మిధానీ చోటు సంపాదించనుంది. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ కౌంటర్ జోరందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 4.4 శాతం జంప్‌చేసి రూ. 572 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 576 వరకూ ఎగసింది.
మదర్‌సన్ సుమీ సిస్టమ్స్
వ్యవస్థాగత పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు ఆటో విడిభాగాల దిగ్గజం మదర్‌సన్ సుమీ సిస్టమ్స్ తాజాగా ప్రకటించింది. దీనిలో భాగంగా దేశీ వైరింగ్, హారన్ బిజినెస్‌ను అనుబంధ సంస్థగా విడదీయనున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో సంవర్ధన మదర్‌సన్ ఆటోమోటివ్ సిస్టమ్స్‌ను విలీనం చేసుకోనున్నట్లు పేర్కొంది. తదుపరి కాలంలో వైరింగ్ బిజినెస్ కలిగిన కంపెనీని స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో మదర్‌సన్ సుమీ కౌంటర్ బలహీనపడింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.5 శాతం పతనమై రూ. 98 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 94 వరకూ తిరోగమించింది.
Comments
Please login to add a commentAdd a comment