హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు చర్యలను ముమ్మరం చేయనున్నట్లు సీఈసీ వి.ఎస్. సంపత్ స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లును సమీక్షించిన సంపత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 70,171 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. అందులో 25,390 సమస్యాత్మకమైన ప్రాంతాలుగా ఉన్నట్లు ఆయన తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే 101 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డబ్బు, మద్య ప్రవాహం ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో రూ.105 కోట్లను స్వాధీనం చేసుకున్నామని సంపత్ పేర్కొన్నారు. ఇది దేశం మొత్తం మీద స్వాధీనం చేసుకున్నదానిలో 46 శాతంగా ఉందని తెలిపారు.
ప్రతి ఒక్కరూ విధిగా ఓటేయాలన్నారు. ఈసారి రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయ పక్షాలు ఇతర పార్టీల గుర్తులు వాడకుండా మోడల్ బ్యాలెట్ లను ముద్రించుకోవచ్చని సంపత్ తెలిపారు.