శ్రీలంక మాజీ కెప్టెన్ దిముత్ కరుణరత్నే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్ట్ తన కెరీర్‌లో చివరి మ్యాచ్ అని వెల్లడించాడు. 36 ఏళ్ల కరుణరత్నేకు టెస్ట్‌ల్లో ఇది 100వ మ్యాచ్ కావడం విశేషం. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన కరుణరత్నే 2012లో తన టెస్ట్ కెరీర్ ప్రారంభించాడు.
13 ఏళ్ల జర్నీలో కరుణరత్నే ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. కెప్టెన్‌గా శ్రీలంకకు ఎన్నో అపురూప విజయాలు అందించాడు. 2019లో శ్రీలంక జట్టు కరుణరత్నే సారథ్యంలో సౌతాఫ్రికాను వారి సొంతగడ్డపై 2-0 తేడాతో (టెస్ట్‌ల్లో) ఓడించింది. సౌతాఫ్రికాను వారి స్వదేశంలో 2-0 తేడాతో ఓడించిన ఏకైక ఆసియా కెప్టెన్ కరుణరత్నేనే.
టెస్ట్‌లకు ముందే (2011, జులైలో) వన్డే అరంగేట్రం చేసిన కరుణరత్నే ఈ ఫార్మాట్‌లో అశించినంతగా రాణించలేకపోయాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో అతను 50 మ్యాచ్‌లు ఆడి 31.3 సగటున 1316 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు, సెంచరీ ఉంది. కరుణరత్నే తన చివరి వన్డే మ్యాచ్‌ను భారత్‌లో జరిగిన 2023 ప్రపంచకప్‌లో ఆడాడు.
వన్డేలతో పోలిస్తే కరుణరత్నే టెస్ట్ గణాంకాలు చాలా బాగున్నాయి. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతను 99 మ్యాచ్‌లు ఆడి 39.4 సగటున 7172 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కరుణరత్నే శ్రీలంక తరఫున అత్యధిక టెస్ట్‌లు ఆడిన ఏడో ఆటగాడిగా నిలిచాడు. లంక తరఫున మహేళ జయవర్దనే అత్యధికంగా 149 టెస్ట్‌లు ఆడాడు. కాగా, ఆసీస్‌తో రెండో టెస్ట్ గాలే వేదికగా ఫిబ్రవరి 6న మొదలవుతుంది. ఈ మ్యాచ్‌తోనే కరుణరత్నే ఆటకు వీడ్కోలు పలుకనున్నాడు.
తొలి టెస్ట్‌లో దారుణ పరాజయం
ఆసీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో శ్రీలంక ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో గెలుపొందింది. ఉస్మాన్ ఖ్వాజా డబుల్ సెంచరీ (232), స్టీవ్ స్మిత్ (141), జోష్ ఇంగ్లిస్ (102) సెంచరీలు చేసి ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (654/6) అందించారు.
అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ లంక ఫేట్ మారలేదు. ఈసారి ఆ జట్టు 247 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో కరుణరత్నే రెండో ఇన్నింగ్స్‌ల్లో నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్పిన్నర్లు మాథ్యూ కుహ్నేమన్ 9, నాథన్ లయోన్ 7 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment