వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక చెత్త రికార్డును సమం చేసింది. ఆసీస్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఓటమి చెందడంతో ప్రపంచకప్‌లో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ చెత్త రికార్డు జింబాబ్వే పేరిట ఉండేది. తాజా ఓటమితో శ్రీలంక.. జింబాబ్వే సరసన చేరింది. ప్రస్తుతం ఈ రెండు జట్లు ప్రపంచకప్‌లో చెరి 42 అపజయాలతో చెత్త రికార్డును పంచుకున్నాయి. ఆతర్వాతి స్ఠానంలో వెస్టిండీస్ ఉంది. ఈ జట్టు 35 పరాజయాలతో మూడో స్థానంలో నిలిచింది. విండీస్ తర్వాత 34 పరాజయాలతో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉంది.
ఇదిలా ఉంటే, లక్నో వేదికగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు పథుమ్ నిస్సంక (61), కుశాల్ పెరీరా (78) మాత్రమే రాణించగా మిగతా వారంతా విఫలమయ్యారు. అసలంక (25) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఈ ముగ్గురు మినహా లంక ఇన్నింగ్స్‌లో కనీసం రెండంకెల స్కోర్ చేసిన ఆటగాడు కూడా లేడు. ఆసీస్ బౌలరల్లో ఆడమ్ జంపా (8-1-47-4) లంకను దారుణంగా దెబ్బకొట్టాడు. స్టార్క్, కమిన్స్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్‌వెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. మిచెల్ మార్ష్ (52), జోష్ ఇంగ్లిస్ (58), లబూషేన్ (40), మ్యాక్స్‌వెల్ (31 నాటౌట్), స్టోయినిస్ (20 నాటౌట్) రాణించడంతో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. డేవిడ్ వార్నర్ (11), స్టీవ్ స్మిత్ (0) నిరాశపరిచారు. లంక బౌలర్లలో దిల్షన్ మధుషంక 3 వికెట్లు పడగొట్టగా.. దునిత్ వెల్లలగే ఓ వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆసీస్‌కు ఇది మొదటి గెలుపు కాగా.. శ్రీలంకకు ఇది హ్యాట్రిక్ ఓటమి.
Comments
Please login to add a commentAdd a comment