కొత్త సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు?
గడువు పొడిగించుకునేందుకు మహంతి విముఖత
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో కొత్త సీఎస్‌గా ఐవైఆర్ కృష్ణారావు నియమితులయ్యే అవకాశముంది. ఆయన ప్రస్తుతం భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ)గా పనిచేస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ప్రసన్నకుమార్ మహంతి ఈ నెల 28వ తేదీతో పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ తరువాత మరో మూడు నెలలు గడువు పొడిగించుకుని కొనసాగే అవకాశం ఆయనకు ఉంది. కానీ ఇందుకు ఆయన విముఖంగా ఉన్నారు. వాస్తవానికి కేంద్ర సర్వీసులో ఉన్న మహంతి.. అప్పట్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కోరిక మేరకు రాష్ట్ర సర్వీసుకు వచ్చారు.
ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంతోపాటు తాను రాష్ట్ర సర్వీసుకు రావడానికి కారణమైన కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా సీఎం పదవికి రాజీనామా చేయడంతో సీఎస్‌గా గడువు పొడిగించుకోవాలనే ఆలోచనను విరమించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 28తో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో రాష్ట్ర కేడర్‌కు చెందిన 1979 ఐఏఎస్ బ్యాచ్ ఐవైఆర్ కృష్ణారావు సమైక్య రాష్ట్రంలో కొత్త సీఎస్‌గా నియమితులవుతారని భావిస్తున్నారు. ఒకవేళ ఈ నెల 28లోగా సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన పక్షంలో.. కొత్త సీఎస్ నియామకాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది. లేదంటే ప్రభుత్వం లేదా గవర్నర్ కొత్త సీఎస్‌ను ఎంపిక చేస్తారు. మహంతి తరువాత సీనియర్‌గా ఐ.వి.సుబ్బారావు ఉన్నారు. అయితే ఆయన యునెస్కోలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీసీఎల్‌ఏగా పనిచేస్తున్న ఐవైఆర్ కృష్ణారావు సీనియర్ కావడంతో కొత్త సీఎస్ ఆయనే కానున్నారని అధికార వర్గాల సమాచారం. కృష్ణారావు సర్వీసు 2016 జనవరి వరకు ఉంది.