samaikya State
-
కొత్త సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు?
గడువు పొడిగించుకునేందుకు మహంతి విముఖత సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో కొత్త సీఎస్‌గా ఐవైఆర్ కృష్ణారావు నియమితులయ్యే అవకాశముంది. ఆయన ప్రస్తుతం భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ)గా పనిచేస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ప్రసన్నకుమార్ మహంతి ఈ నెల 28వ తేదీతో పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ తరువాత మరో మూడు నెలలు గడువు పొడిగించుకుని కొనసాగే అవకాశం ఆయనకు ఉంది. కానీ ఇందుకు ఆయన విముఖంగా ఉన్నారు. వాస్తవానికి కేంద్ర సర్వీసులో ఉన్న మహంతి.. అప్పట్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కోరిక మేరకు రాష్ట్ర సర్వీసుకు వచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంతోపాటు తాను రాష్ట్ర సర్వీసుకు రావడానికి కారణమైన కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా సీఎం పదవికి రాజీనామా చేయడంతో సీఎస్‌గా గడువు పొడిగించుకోవాలనే ఆలోచనను విరమించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 28తో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో రాష్ట్ర కేడర్‌కు చెందిన 1979 ఐఏఎస్ బ్యాచ్ ఐవైఆర్ కృష్ణారావు సమైక్య రాష్ట్రంలో కొత్త సీఎస్‌గా నియమితులవుతారని భావిస్తున్నారు. ఒకవేళ ఈ నెల 28లోగా సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన పక్షంలో.. కొత్త సీఎస్ నియామకాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది. లేదంటే ప్రభుత్వం లేదా గవర్నర్ కొత్త సీఎస్‌ను ఎంపిక చేస్తారు. మహంతి తరువాత సీనియర్‌గా ఐ.వి.సుబ్బారావు ఉన్నారు. అయితే ఆయన యునెస్కోలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీసీఎల్ఏగా పనిచేస్తున్న ఐవైఆర్ కృష్ణారావు సీనియర్ కావడంతో కొత్త సీఎస్ ఆయనే కానున్నారని అధికార వర్గాల సమాచారం. కృష్ణారావు సర్వీసు 2016 జనవరి వరకు ఉంది. -
పోరు బాట
సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా జిల్లా ప్రజలు పోరుబాటలో సాగుతున్నారు. ఉద్యోగులు ఉద్యమ బాట వీడినా, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ సమైక్య రాష్ట్రం కోసం పాటుపడకపోయినా.. సామాన్యులు మాత్రం వైఎస్సార్సీపీ అండతో అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమైక్య శంఖారావం సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం కావడంతో జిల్లాలోని సమైక్యవాదుల్లో రెట్టింపు ఉత్సాహం కన్పిస్తోంది. అదే ఉత్సాహంతో 88వ రోజైన శనివారం జిల్లాలో సమైక్య పోరు జోరుగా కొనసాగించారు. ధర్మవరంలోని కాలేజీ సర్కిల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగించారు. పామిడిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మౌనదీక్ష చేపట్టారు. ‘సేవ్ ఏపీ’ అంటూ విద్యార్థులు మౌనప్రదర్శన చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. తలుపులలో రాస్తా రోకో నిర్వహించారు. క ళ్యాణదుర్గంలో మూడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు, జేఏసీ నాయకులు ర్యాలీలు చేపట్టారు. విద్యార్థులు స్థానిక టీసర్కిల్లో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ ఆకారంలో నిలబడి నిరసన తెలిపారు. గోరంట్లలో విద్యార్థులు రాస్తారోకో చేశారు. రాయదుర్గంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలోని పోలీసుస్టేషన్ సర్కిల్లో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కూడేరులో విద్యార్థులు మానవహారం నిర్మించారు. -
‘సమైక్యం’తోనే అభివృద్ధి
ఒంగోలు, న్యూస్‌లైన్ :రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. సమైక్య రాష్ట్ర సాధన కోసం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా ఆటోలు, రిక్షాలతో గురువారం సమైక్య ర్యాలీలు నిర్వహించారు. రిక్షా కార్మికులు తాము సైతం అంటూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైఎస్సార్సీపీ సమైక్య ర్యాలీకి సంఘీభావం ప్రకటించారు. కందుకూరులో జిల్లా కన్వీనర్, కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త నూకసాని, మరో సమన్వయకర్త ఉన్నం వీరాస్వామిలు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టణంలోని అన్ని ప్రధాన వీధుల్లో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు నాందిపలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సమైక్యాంధ్ర పేరుతో ఉద్యమాలు చేయడం హాస్యాస్పదమన్నారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేశామంటూ తప్పుడు ప్రకటనలివ్వడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. మార్కాపురంలో నియోజకవర్గ సమన్వయకర్తలు వెన్నా హనుమారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డిలు పార్టీ కార్యాలయం వద్ద ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పట్టణ వీధుల నుంచి ర్యాలీ కోర్టు సెంటర్ వద్దకు చేరుకోగా పార్టీ కార్యకర్తలు అక్కడ రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సమన్వయకర్తలు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఏ పార్టీ కట్టుబడి ఉందో జనానికి స్పష్టంగా అర్థమవుతోందన్నారు. సమైక్య శంఖారావానికి అడ్డంకులు సృష్టించిన సీఎం ఏ రకమైన సమైక్యవాదో తేటతెల్లమైందన్నారు. ఒంగోలులో పార్టీ జిల్లా కార్యాలయం వద్ద ర్యాలీని జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్‌లు ప్రారంభించారు. అనంతరం ర్యాలీ ప్రధాన రహదారుల్లో సాగింది. చర్చి సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద ఆటోలను వలయంగా ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కేంద్రమంత్రులు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఇకనైనా డ్రామాలు ఆపాలని మండిపడ్డారు. ప్రజలను నిత్యం మభ్యపెట్టగలమని భావిస్తే అది రాజకీయ జీవితానికి గ్రహపాటుగా మారుతుందని హెచ్చరించారు. రాష్ట్ర విభజన ఆగేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించినట్లు అసెంబ్లీని సమావేశపరిచి సమైక్యాంధ్రకు సంఘీభావంగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించడం ఒక్కటే మార్గమన్నారు. కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ప్రకాశం జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, రైతు కూలీలు సమైక్యాంధ్రకు సంఘీభావం ప్రకటించేందుకు ముందుకు రావాలని కోరారు. యర్రగొండపాలెంలో గురువారం సాయంత్రం ఆటో రిక్షాల ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకుంటే పశ్చిమ ప్రకాశం మొత్తం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గిద్దలూరులో నియోజకవర్గ సమన్వయకర్తలు ముత్తుముల అశోక్‌రెడ్డి, వై.వెంకటేశ్వరరావులు ఆటోరిక్షాల ర్యాలీని ప్రారంభించారు. రాష్ట్ర విభజనతో విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఉద్యమంలో విద్యార్థులు ప్రధాన పాత్ర పోషించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సూరా పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చీరాల పోస్టాఫీస్ సెంటర్లో నియోజకవర్గ సమన్వయకర్తలు సజ్జా హేమలత, అవ్వారు ముసలయ్యలు ర్యాలీని ప్రారంభించారు. సాల్మన్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించే సమైక్య శంఖారావానికి ప్రతి ఒక్కరూ కదిలిరావాలని పిలుపునిచ్చారు. -
సమైక్య రాష్ట్రమే జగన్ లక్ష్యం
ఒంగోలు, న్యూస్‌లైన్ : సమైక్య రాష్ట్రమే వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో గురువారం నగరంలో ఆటోరిక్షాల ర్యాలీ నిర్వహించారు. తొలుత లాయరుపేటలోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయం నుంచి బయలుదేరిన ర్యాలీ నగర ప్రధాన వీధుల గుండా చర్చిసెంటర్ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో నెలపాటు ఉద్యమాలు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించినట్లు తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు డ్రామాలు ఆపాలన్నారు. ప్రజలను నిత్యం మభ్యపెట్టగలమని భావిస్తే అది వారి రాజకీయ జీవితాలకు శాపంగా మారుతుందని హెచ్చరించారు. అసెంబ్లీని వెంటనే సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాలని కోరారు. ఒంగోలు నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయంతో సీమాంధ్ర భగ్గుమంటోందన్నారు. వైఎస్ఆర్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపు మేరకు సమైక్యానికి మద్దతు తెలిపిన కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీల అధ్యక్షులతో రాజీనామాలు చేయించాకే సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని కాంగ్రెస్, టీడీపీల నాయకులను డిమాండ్ చేశారు. పార్టీ నాయకుడు సింగరాజు వెంకట్రావు మాట్లాడుతూ స్పీకర్ కార్యాలయ ప్రకటనతో రాజీనామాలపై ఎవరు డ్రామాలాడుతున్నారో స్పష్టమైందన్నారు. కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, నగర మహిళా కన్వీనర్ కావూరి సుశీల, వివిధ విభాగాల నగర కన్వీనర్లు బొప్పరాజు కొండలు, నెరుసుల రాము, ముదివర్తి బాబూరావు, యరజర్ల రమేష్ , జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వంకే రాఘవరాజు, కత్తినేని రామకృష్ణారెడ్డి, ఎస్వీ రమణయ్య, తోటపల్లి సోమశేఖర్, ప్రమీల పాల్గొన్నారు.