సమైక్య రాష్ట్రమే జగన్ లక్ష్యం
Published Fri, Oct 18 2013 3:02 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
ఒంగోలు, న్యూస్‌లైన్ : సమైక్య రాష్ట్రమే వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో గురువారం నగరంలో ఆటోరిక్షాల ర్యాలీ నిర్వహించారు. తొలుత లాయరుపేటలోని వైఎస్‌ఆర్ సీపీ కార్యాలయం నుంచి బయలుదేరిన ర్యాలీ నగర ప్రధాన వీధుల గుండా చర్చిసెంటర్ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో నెలపాటు ఉద్యమాలు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించినట్లు తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు డ్రామాలు ఆపాలన్నారు. ప్రజలను నిత్యం మభ్యపెట్టగలమని భావిస్తే అది వారి రాజకీయ జీవితాలకు శాపంగా మారుతుందని హెచ్చరించారు. అసెంబ్లీని వెంటనే సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాలని కోరారు.
ఒంగోలు నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయంతో సీమాంధ్ర భగ్గుమంటోందన్నారు. వైఎస్‌ఆర్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపు మేరకు సమైక్యానికి మద్దతు తెలిపిన కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీల అధ్యక్షులతో రాజీనామాలు చేయించాకే సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని కాంగ్రెస్, టీడీపీల నాయకులను డిమాండ్ చేశారు. పార్టీ నాయకుడు సింగరాజు వెంకట్రావు మాట్లాడుతూ స్పీకర్ కార్యాలయ ప్రకటనతో రాజీనామాలపై ఎవరు డ్రామాలాడుతున్నారో స్పష్టమైందన్నారు. కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, నగర మహిళా కన్వీనర్ కావూరి సుశీల, వివిధ విభాగాల నగర కన్వీనర్లు బొప్పరాజు కొండలు, నెరుసుల రాము, ముదివర్తి బాబూరావు, యరజర్ల రమేష్ , జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వంకే రాఘవరాజు, కత్తినేని రామకృష్ణారెడ్డి, ఎస్‌వీ రమణయ్య, తోటపల్లి సోమశేఖర్, ప్రమీల పాల్గొన్నారు.
Advertisement