హైకోర్టుకు విన్నవించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచన
సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం చేతులెత్తేసింది. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మరో నాలుగు నెలలు గడువు కావాలంటూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. సెప్టెంబర్ రెండో తేదీ నాటికి మునిసిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో గురువారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డితో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతితో చర్చించి, ఆ అఫిడవిట్‌లో పొందుపర్చాల్సిన అంశాలను వారి నుంచి తీసుకోవాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తాయని, అంతేకాకుండా ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడం వల్ల ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదన్న అభిప్రాయాన్నీ అఫిడవిట్‌లో పొందుపరచనున్నట్లు సమాచారం.
సీమాంధ్రలో రాజమం డ్రి, గుంటూరు, అనంతపురం రీజియన్‌ల నుంచి ఎన్నికల సమాయత్తానికి సంబంధించిన సమాచారం రావడం లేదని ఉన్నతాధికారులు సీఎంకు సమావేశంలో వివరించారు. హైదరాబాద్, వరంగల్, విశాఖపట్టణం రీజియన్‌ల నుంచి ఓటర్ల జాబితా, వార్డుల రిజర్వేషన్ల ముసాయిదా నోటిఫికేషన్‌లు జారీ అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 165 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలు, 19 మునిసిపల్ కార్పొరేషన్లు ఉండగా, ప్రస్తుతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఒక్కదానికి మాత్రమే పాలకమండలి ఉంది. మిగిలిన వాటికి ప్రత్యేకాధికారులే పాలకులు. మూడేళ్లుగా వారి అధీనంలోనే పాలన కొనసాగుతోంది. ఏదేమైనా మునిసిపల్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదన్న విషయం స్పష్టమవుతోంది.
మున్సిపోల్స్‌కు 4 నెలల గడువివ్వండి
Published Fri, Aug 23 2013 6:22 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement