సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత దృష్ట్యా మినీ మున్సిపోల్స్ ఉంటాయా లేదా అన్న సందిగ్ధానికి తెరపడింది. ఈ నెల 30న మినీ మున్సి‘పోల్స్’యథాతథంగా జరగనున్నాయి. ముందుగా ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం రెండు కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ)ను ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బుధవారం రాత్రి ఎస్‌ఈసీకి మున్సిపల్ పరిపాలన శాఖ ద్వారా వర్తమానం అందినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి అనుగుణంగా యధాతథంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి గురువారం హైకోర్టుకు తెలియజేయడంతోపాటు గతంలో ప్రకటించిన మేరకు పోలింగ్, కౌంటింగ్ తదితర ఏర్పాట్లు చేసుకోవాలని మున్సిపల్, సంబంధిత అధికారులకు ఎస్‌ఈసీ ఆదేశాలు జారీచేయనున్నట్టు తెలిసింది. మున్సిపల్ చట్టంలో చేసిన సవరణలకు అనుగుణంగా ఎన్నికల తేదీపై నిర్ణయాధికారం ప్రభుత్వానికే ఉండటంతో ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలా లేక వాయిదా వేయాలా అన్న అంశంపై స్పష్టత కోరుతూ రాసిన లేఖకు ప్రభుత్వం నుంచి ఈ మేరకు సమాధానం రావడంతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎస్‌ఈసీ నిమగ్నమైంది.
ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కదా..
ప్రస్తుత కరోనా కల్లోల పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేయాలంటూ వివిధ రాజకీయ పార్టీలు ఎస్‌ఈసీని కోరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే నామినేషన్ల దాఖలు ముగిసి, గురువారం పోటీచేసే అభ్యర్థుల తుది జాబితా కూడా వెలువడ¯నున్న నేపథ్యంలో 30న జరగాల్సిన పోలింగ్ నిర్వహణ నుంచి వెనక్కు తగ్గే అవకాశాలు లేవని ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన మేరకు నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలతో పాటు, స్థానిక సంస్థలు, ఇతర ఎన్నికలు కొనసాగిన విషయాన్ని ఎస్‌ఈసీకి పంపిన వర్తమానంలో ప్రభుత్వం తరఫున మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖలు ఉటంకించినట్టు తెలుస్తోంది. కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా తగిన జాగ్రత్తలతో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. ఇప్పటికే కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా మే 1 ఉదయం 5 గంటల వరకు రాత్రి కరŠూప్య విధించిన విషయాన్ని ప్రభుత్వం పొందుపరిచినట్లు తెలుస్తోంది.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ...
మున్సిపల్ ఎన్నికల ప్రచారం, సభల నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి కోవిడ్ నిబంధనలు పాటించడంపై ఇదివరకే ఎస్‌ఈసీ ఆదేశాలు జారీచేసింది, అదేవిధంగా ఎన్నికల అధికారులు, సిబ్బందికి పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇది వరకు సవివర సర్క్యులర్ జారీ చేసింది. ఇదిలా ఉంటే గురువారం నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక సాయంత్రం ఆయా మున్సిపాలిటీల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈనెల 30న రెండు కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఎక్కడైనా అవసరమైతే మే 2న రీపోలింగ్ ఉంటుంది. 3న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, అది ముగిశాక ఫలితాలు ప్రకటిస్తారు.
కరోనా ఎంతున్నా ఎన్నికలు జరుపుతాం
Published Thu, Apr 22 2021 1:40 AM | Last Updated on Thu, Apr 22 2021 2:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment