సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. రేపు(జనవరి 22) ఎన్నికల జరగనున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో 55 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టడానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిఘా పెంచాలని సూచించారు.(మున్సిపల్ ఎన్నికల్లో విజయం మనదే)
ఎన్నికల్లో ఖర్చు పెట్టిన లెక్కలు తప్పుగా చూపినప్పుడు అభ్యర్థిపై చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే అభ్యర్థి ఎన్నిక రద్దు చేస్తామని హెచ్చరించారు. అభ్యర్థుల ఆస్తులు, నేర చరిత్ర వివరాలు ఎన్నికల సంఘం దగ్గర వున్నాయని, డబ్బులు ఎరవేసే వాళ్ళను ఎన్నుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో విన్నింగ్ మార్జిన్ పదుల్లోనే ఉంటుందని, ప్రతి ఓటు కీలకమైనదన్నారు. తమ ఓటు వేరే వాళ్ళు వేస్తే టెండర్ ఓటు వేయాలని, రిగ్గింగ్ జరిగిన చోట రిపోలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కాగా పెద్దపల్లిలో డబ్బులు పంచుతుండగా వీడియో తీయడంతో అరెస్ట్ చేశామని అన్నారు. గద్వాల, అలంపూర్ లో డబ్బులు పంచుతున్న కేసులు నమోదు అయ్యాయని, ఎన్నికల నేపథ్యంలో 44లక్షల 41 వేల రూపాయలు సీజ్ చేశామని కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment