EC nagireddy
-
గతంతో పోలిస్తే ఈసారి తక్కువే: ఈసీ
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. రేపు(జనవరి 25) 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం, పురపాలకశాఖ సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ... కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ రోజు (శుక్రవారం) కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 58 డివిజన్లకు పోలింగ్ జరిగింది. వీటి కౌంటింగ్ జనవరి 27న చేపట్టనున్నట్టు తెలిపారు. ఫలితాలు విడుదల చేసేంతవరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని తెలిపారు.(మూడు చోట్ల రీపోలింగ్ ) గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం తక్కువ అయ్యిందని అన్నారు. ఈ సారి మున్సిపాలిటీల్లో 74.40 శాతం..గతంలో 75.85 శాతం పోలింగ్ నమోదయ్యిందని తెలిపారు. అదే విధంగా రాజకీయ పార్టీలు మేయర్, చైర్మన్ల పేర్లను ఏ-ఫారం, బీ-ఫారం రూపంలో ఇవ్వాలన్న ఈసీ ఈ నెల 26న 11 గంటల వరకు ఏ-ఫారం, 27న ఉదయం 10 గంటల వరకు బీ-ఫారం సమర్పించాలని సూచించింది. ఈ సారి కార్పొరేషన్ల లో 58.83 శాతం.. గతంలో60.63 శాతం నమోదు అయ్యినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ.. ఎన్నికల కౌంటింగ్ కు పూర్తి స్థాయి లో ఏర్పాట్లు చేశామన్నారు. చైర్మన్, మేయర్ ఎన్నిక ప్రక్రియ పరోక్ష పద్దతిలో సాగుతోందని తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీలు తన నియోజకవర్గం పరిధిలో ఒక్క మున్సిపాలిటీలో మాత్రమే ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అన్నారు. ఓటు హక్కు కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు కలెక్టర్‌కు ఆప్షన్ ఇవ్వాలని సూచించారు. చదవండి : 27న మేయర్లు, చైర్మన్ల ఎన్నిక -
అవసరమైతే అభ్యర్థి ఎన్నిక రద్దు చేస్తాం: ఈసీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. రేపు(జనవరి 22) ఎన్నికల జరగనున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో 55 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టడానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిఘా పెంచాలని సూచించారు.(మున్సిపల్ ఎన్నికల్లో విజయం మనదే) ఎన్నికల్లో ఖర్చు పెట్టిన లెక్కలు తప్పుగా చూపినప్పుడు అభ్యర్థిపై చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే అభ్యర్థి ఎన్నిక రద్దు చేస్తామని హెచ్చరించారు. అభ్యర్థుల ఆస్తులు, నేర చరిత్ర వివరాలు ఎన్నికల సంఘం దగ్గర వున్నాయని, డబ్బులు ఎరవేసే వాళ్ళను ఎన్నుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో విన్నింగ్ మార్జిన్ పదుల్లోనే ఉంటుందని, ప్రతి ఓటు కీలకమైనదన్నారు. తమ ఓటు వేరే వాళ్ళు వేస్తే టెండర్ ఓటు వేయాలని, రిగ్గింగ్ జరిగిన చోట రిపోలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కాగా పెద్దపల్లిలో డబ్బులు పంచుతుండగా వీడియో తీయడంతో అరెస్ట్ చేశామని అన్నారు. గద్వాల, అలంపూర్ లో డబ్బులు పంచుతున్న కేసులు నమోదు అయ్యాయని, ఎన్నికల నేపథ్యంలో 44లక్షల 41 వేల రూపాయలు సీజ్ చేశామని కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. చదవండి: ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం టీఆర్ఎస్ దెబ్బకు ప్రతిపక్షాలు మటాష్..! -
జనవరి 4న తుది ఓటరు జాబితా: ఈసీ
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల సంఘం కొత్త పద్దతిని ప్రారంభించిందని, తుది ఓటరు జాబితాకు ముందే షెడ్యూల్ విడుదల చేశామని ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల డ్రాప్ట్ ఓటర్ జాబితా అందుబాటులో ఉందని, వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేశామన్నారు. ఓటరు జాబితాపై జనవరి 2వ తేది వరకు అభ్యంతరాలు చెప్పవచ్చని తెలిపారు. అసెంబ్లీ జాబితాలో పేరు ఉండి.. ఇప్పుడు లేకపోతే సమస్యను పరిష్కరిస్తామన్నారు. జనవరి 4న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామన్నారు. సెక్షన్ 195, 197 ప్రకారం ప్రభుత్వ అనుమతితోనే షెడ్యూల్ విడుదల చేశామని పేర్కొన్నారు. షెడ్యూల్ విడుదల చట్టప్రకారం చేశామని, ఎన్నికల నిర్వహణపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాగిరెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల సమావేశంలో గొడవ వల్ల వివరంగా చెప్పలేక పోయామని, జనవరి 6వ తేదీ తరువాత రిజర్వేషన్లు ప్రకటిస్తామన్నారు. జనవరి 8 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. టీ పోల్ సాఫ్ట్వేర్ నుంచి, ఓటరు జాబితా నుంచి నామినేషన్ ఫామ్ తీసుకోవచ్చని అన్నారు. నామినేషన్‌ను ఆన్లైన్లో అప్లోడ్ చేసినంత మాత్రాన నామినేషన్ వేసినట్లు కాదన్నారు. ఒరిజినల్ నామినేషన్ కాపీని రిటర్నింగ్ అధికారికి నేరుగా ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో 35 నుంచి 40 వేల వరకు సిబ్బంది ఉంటారని, విధుల్లో వచ్చే సిబ్బంది అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది 13 వ తేది వరకు పోస్టల్ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీడీఎంఏ డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ..141 మున్సిపాలిటీలకు కలిపి రాష్ట్ర స్థాయిని యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్లు ప్రకటిస్తామన్నారు. 130 మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి మించకుండా ఖరారు చేస్తామని తెలిపారు. జనవరి 5వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ ఛైర్మన్ రిజర్వేషన్లు ప్రకటిస్తామని, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల రిజర్వేషన్లు కలెక్టర్లు ప్రకటిస్తారని పేర్కొన్నారు. -
బ్యాలెట్ పేపర్‌పై ఆ రెండు మాత్రమే..
సాక్షి, హైదరాబాద్: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షలో చర్చించారు. మున్పిపల్ ఎన్నికలకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. పోలింగ్ రిటర్నింగ్ అధికారులకు మరోసారి శిక్షణ ఇవ్వాలన్నారు. పెరిగిన ఓటర్ల నేపథ్యంలో కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు ఈసీ నాగిరెడ్డి చెప్పారు. మొత్తం సుమారు 53 లక్షల మంది ఓటర్లున్నారని తెలిపారు. బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ తరువాతనే బ్యాలెట్ పేపర్లు ప్రింటింగ్‌కు ఇస్తామని చెప్పారు. రాజకీయ పార్టీలతో రేపు ఉదయం 11.30 గంటలకు సమావేశం కానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, పురపాలక శాఖ ఎండీ శ్రీదేవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఎన్నికల కమిషనర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్ : ఓటర్ల జావబితా ప్రకటన చేయకుండా నోటిషికేషన్ ఎలా ఇస్తారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ను రాష్ట్రంలో రెండు శాఖలు కాపాడుతున్నాయని.. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్, పోలింగ్ సమయంలో పోలీసులు టీఆర్ఎస్ను కాపాడుతున్నాయని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఇవ్వకముందే టీఆర్ఎస్ కార్యకర్తల ఫేస్‌బుక్‌లోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. నాగిరెడ్డి ఎన్నికల అధికారినా..లేక టీఆర్ఎస్ కార్యకర్తనా అని విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకొని దొడ్డి దారిన గెలవాలని టీఆర్ఎస్ చూస్తుందని, మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మరో వైపు కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డిని కలిశారు. సంక్రాంతి పండగ తరువాత నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషనర్‌ను కోరారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. అనంతరం మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. కోర్టు సూచనల మేరకు డిలిమిటేషన్ జరిగిందన్నారు. జనాభాకు సంబంధించిన అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, అయినా కావాలనే ప్రకటించడం లేదని విమర్శించారు. అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసి ఇష్టానుసారంగా షెడ్యూల్ ప్రకటించిందని ఆరోపించారు. రిజర్వేషనల ప్రకటన ఎన్నికల తేదికి ఒక్క రోజు ఉంచడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ మార్చడానికి అవకాశం ఉందని, రిజర్వేషన్ ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని కోరారు. -
సెప్టెంబర్‌లో ‘పుర’ఎన్నికలు!
- ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సలహా హైదరాబాద్: జీహెచ్ఎంసీ తరహాలోనే రాష్ట్రంలో మరో 11 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న అంశంపై ‘పురం..పాలన శూన్యం’ శీర్షికతో సోమవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ బి.నాగిరెడ్డి స్పందించారు. ఈ మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై ఆయన పురపాలక శాఖ నుంచి నివేదిక కోరారు. దీంతో రాష్ట్ర పురపాలక శాఖ డెరైక్టర్ బి.జనార్దన్‌రెడ్డి, ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి కమిషనర్‌కు స్టేటస్ రిపోర్టును అందజేశారు. ఈ సందర్భంగా మరో 3 నెలల్లో ఎన్నికలకు సంబంధించిన కసరత్తు పూర్తిచేసి సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని ఎన్నికల కమిషనర్ పురపాలక శాఖకు సలహా ఇచ్చినట్లు సమాచారం.