సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. రేపు(జనవరి 25) 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం, పురపాలకశాఖ సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ... కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ రోజు (శుక్రవారం) కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 58 డివిజన్లకు పోలింగ్ జరిగింది. వీటి కౌంటింగ్ జనవరి 27న చేపట్టనున్నట్టు తెలిపారు. ఫలితాలు విడుదల చేసేంతవరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని తెలిపారు.(మూడు చోట్ల రీపోలింగ్ )
గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం తక్కువ అయ్యిందని అన్నారు. ఈ సారి మున్సిపాలిటీల్లో 74.40 శాతం..గతంలో 75.85 శాతం పోలింగ్ నమోదయ్యిందని తెలిపారు. అదే విధంగా రాజకీయ పార్టీలు మేయర్, చైర్మన్ల పేర్లను ఏ-ఫారం, బీ-ఫారం రూపంలో ఇవ్వాలన్న ఈసీ ఈ నెల 26న 11 గంటల వరకు ఏ-ఫారం, 27న ఉదయం 10 గంటల వరకు బీ-ఫారం సమర్పించాలని సూచించింది. ఈ సారి కార్పొరేషన్ల లో 58.83 శాతం.. గతంలో60.63 శాతం నమోదు అయ్యినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ.. ఎన్నికల కౌంటింగ్ కు పూర్తి స్థాయి లో ఏర్పాట్లు చేశామన్నారు. చైర్మన్, మేయర్ ఎన్నిక ప్రక్రియ పరోక్ష పద్దతిలో సాగుతోందని తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీలు తన నియోజకవర్గం పరిధిలో ఒక్క మున్సిపాలిటీలో మాత్రమే ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అన్నారు. ఓటు హక్కు కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు కలెక్టర్‌కు ఆప్షన్ ఇవ్వాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment