
కొత్త రాజధానికి వెళ్లాలా వద్దా?
హైదరాబాద్: కొత్త రాజధానికి తరలి వెళ్లే విషయంలో ఏపీ సచివాలయం ఉద్యోగులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ అంశంపై చర్చించుకునేందుకు బుధవారం ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాల సమావేశం నిర్వహించారు.
రాజధానికి తరలి వెళ్లడంపై సమాలోచనలు చేశారు. ప్రత్యేక హోదా కోసం చేయాల్సిన పోరాటంపై కూడా ఉద్యోగ సంఘాలు చర్చించాయి. అనంతరం విజయవాడకు కార్యాలయాల తరలింపుపై సాయంత్రం సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు డిమాండ్లు సీఎస్ ముందుకు తెచ్చారు. వాటిల్లో..
* సరైన సౌకర్యాలు కల్పిస్తేనే కొత్త రాజధాని ప్రాంతానికి వెళతాం.
* ఇప్పటికిప్పుడు రాజధానికి తరలి వెళ్లాలంటే సాధ్యం కాదు
* మౌలిక, గృహ వసతితోపాటు 35శాతం హెచ్ఆర్ఏ సంగతి కూడా తేల్చాలి
* తమ పిల్లలు అక్కడ స్థానికేతరులుగా మారే అవకాశం ఉన్నందున స్థానికతపై స్పష్టత ఇవ్వాలి
* వారానికి ఐదు రోజులే పనిదినాలు ఉండాలి
* బస్సు సౌకర్యాలు కల్పించాలి
* ముందు వీటిన్నింటిపై స్పష్టత ఇవ్వాలి.. అప్పుడే ఎంతమంది వెళ్లాలో నిర్ణయించుకుంటాం