ఐఏఎస్... మన దేశంలో యువత కలలు కనే ఉన్నతోద్యోగం. ఇది ఉద్యోగం మాత్రమే కాదు, సమాజానికి సేవ చేసే బృహత్తర అవకాశం. ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్కరూ తమను తాము నిరూపించుకోవాలని పరితపిస్తారు. అందులో కొద్దిమంది మాత్రమే యువ అధికారులకు స్ఫూర్తి ప్రదాతలుగా చరిత్ర పుటలకెక్కుతారు. అందులో ముందు వరసలో నిలిచే అధికారి ఎస్వీ ప్రసాద్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఆయన వ్యక్తిత్వం, కార్యదక్షత ఎనలేనివి. కోవిడ్‌వల్ల ఆయన మరణిం చడం దిగ్భ్రమ.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన సిగటపు వీర ప్రసాద్ (ఎస్వీ ప్రసాద్) 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అహ్మ దాబాద్ ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత సివిల్ సర్వీసుల వైపు మళ్లారు. నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్‌గా కెరియర్ ప్రారంభించారు. 1982లో కడప కలెక్టర్‌గా, 1985లో విశాఖ పట్నం కలెక్టర్‌గా పనిచేశారు. చిన్న వయసులోనే విశాఖలో కమి షనర్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా పనిచేసిన ప్రసాద్ విశాఖ నగరాభివృద్ధికి గట్టి పునాదులు వేశారు. 2009లో భూప రిపాలన ప్రధాన కమిషనరుగానూ విధులు నిర్వర్తించారు. ఏపీ జెన్‌కో చైర్మన్‌గా, ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ, వైఎస్ చైర్మన్‌గా బాధ్య తలు నిర్వర్తించారు.
విద్యుత్తు సంస్కరణల్లో ఏపీ నంబర్ వన్‌గా నిలిచిందంటే అది ఆయన చలవే. విద్యుత్తు రంగం అంటే ప్రసాద్‌కు మక్కువ. మానవ మనుగడకు, దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేయడం, ప్రజలకు నాణ్యమైన, నమ్మకమైన కరెంటును సరఫరా చేయడం విషయంలో నిర్దిష్ట అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు. ఆయన సూచనలతో అధికార వర్గం చేపట్టిన సంస్కరణలను నాటి వాజ్ పేయి ప్రభుత్వంలోని కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి ప్రత్యేకంగా కొనియాడారు. నిరంతరం చెరగని చిరునవ్వుతో పనిచేసే ఆయనకు అధికార వర్గాల్లో ‘జెంటిల్‌మేన్ బ్యూరో క్రాట్’ అనే పేరుంది. అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు అందరితోనూ ఒకే విధంగా వ్యవహరిస్తూ, ఓర్పుతో విధులు నిర్వర్తించేవారు.
ఒక ఐఏఎస్ అధికారి సాధారణంగా ఒక ముఖ్యమంత్రి దగ్గర ముఖ్య కార్యదర్శిగా పనిచేయడమే గొప్ప! కానీ, ఎస్వీ ప్రసాద్ ఏకంగా ముగ్గురు సీఎంలు– నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నారా చంద్రబాబునాయుడు దగ్గర సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కొద్ది కాలం ఆయన పేషీలోనూ పనిచేశారు. సహజంగా సీఎం మారగానే ఆయన పేషీలోని అధికారులకు స్థాన చలనం కలుగుతుంది. కానీ, ప్రసాద్ మాత్రం నలుగురు సీఎంల పేషీల్లో దాదాపు 13 ఏళ్లు విధులు నిర్వర్తించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా పనిచేయాలన్నది ప్రతి ఐఏఎస్ అధికారి కల. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత సివిల్ సర్వీస్ పోస్టు అయిన ప్రధాన కార్యదర్శి పదవిని ఎస్వీ ప్రసాద్ 2009లో దక్కించుకున్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2011 సెప్టెంబర్ చివరి వరకూ పనిచేశారు. ముఖ్య మంత్రులు తమకు ఇష్టమైన, సమర్థుడైన అధికారిని ఎంపిక చేసుకొంటారు. అది సాధారణ ప్రక్రియ. డజన్‌కు పైగా సీని యర్లను పక్కనపెట్టి మరీ నాటి ముఖ్యమంత్రి ప్రసాద్‌కు అవ కాశం ఇచ్చారు. అవి అక్షరాలా, ఆణిముత్యాలా! ఆయన వ్యక్తిత్వం లాగానే దస్తూరి కూడా అద్భుతమే.
2009 అక్టోబర్‌లో వరదలు వచ్చిన సమయంలో ఆయన సేవలు ఎనలేనివి. శ్రీశైలం జలాశయానికి శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా 25 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. ఆయన కాలంతో పోటీపడి సమయస్ఫూర్తితో తీసుకున్న నిర్ణయాల వల్లే శ్రీశైలం డ్యామ్ సురక్షితంగా ఉంది. ఏ మాత్రం పొరపాటు జరిగినా జల ప్రళయమే. కర్నూలు, విజయవాడ, గుంటూరు వంటి నగరాలు నామరూపాల్లేకుండా పోయేవి. తెల్లవారుజామున 5 గంటలకు ఆయన దినచర్య మొదలై, అర్ధరాత్రి 12 గంటల వరకు అవిశ్రాంతంగా కొనసాగేది. చిరు ద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు ఎవరు వచ్చినా ఓపిగ్గా మాట్లాడేవారు. ఎవరు ఫోన్ చేసినా స్పందించేవారు. ‘ఎవరైనా అవసరం ఉంటేనే కదా ఫోన్ చేస్తారు’ అనేవారు.
1993లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్న సమ యంలో విశాఖ ఏజెన్సీలో ఎమ్మెల్యే బాలరాజును నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. సీనియర్ ఐఏఎస్ అర్జునరావు, సీనియర్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డిల సహకారంతో బాలరాజు కిడ్నాప్ కథ సుఖాంతం అవడంలో కీలకపాత్ర పోషించారు.
తరచూ ‘గాడ్ ఈజ్ గ్రేట్’ అనేవారు. సాధ్యమైనంత వరకు మనం చేయగలిగిన సాయం చేస్తూనే ఉండాలని చెప్పేవారు. ఆయనలో మరో విశేష గుణం బాగా పనిచేసే వారిని వెన్నుతట్టి ప్రోత్సహించడం. వీఆర్వో నుంచి కలెక్టర్ వరకు ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఫోన్ చేసి అభినందించేవారు. ఏ అధికారికైనా అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి ఏ పార్టీ వారైనా సరే న్యాయం చేయడానికి ప్రయత్నించేవారు.
ఐఏఎస్ అధికారిగా దాదాపు 40 ఏళ్ల పాటు సేవలందించినా ఎన్నడూ ఇసుమంతైనా గర్వం ప్రదర్శించలేదు. వైఎస్ రాజ శేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రసాద్ సీసీఎల్‌ఏగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయినా ఆయనకు ఏపీ జెన్కో ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల కోసం ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, నిబంధనలు ఉల్లంఘిం చకుండా తక్కువ ధరకు బొగ్గు కొనాలని వైఎస్ సూచించారు. ప్రసాద్ అందుకోసం డి. ప్రభాకర్ రావుతో కలిసి ఒక నివేదిక ఇచ్చారు. దాన్ని చూసి వైఎస్ ఎంతగానో మెచ్చుకున్నారు. ఆ నివేదికను అమలు చేయడం వల్ల బొగ్గు కొనుగోళ్లలో దాదాపు రూ.1000 కోట్లు ఆదా అయింది. హైదరాబాదులోని ఓ అనాథా శ్రమంలోని పిల్లల చదువుల కోసం తన వేతనంలో కొంత భాగాన్ని మూడోకంటికి తెలియకుండా ఇచ్చేవారు.
ఆయన మరణ వార్తకు మీడియా ఎనలేని ప్రాధాన్య మిచ్చింది. ‘ఉమ్మడి ఏపీ పూర్వ సీఎస్ ఎస్వీ ప్రసాద్ ఇక లేరు’ అంటూ ఆయన విశిష్టతను మరోసారి ప్రజలకు గుర్తుచేసింది. సివిల్ సర్వీసుల్లో ఉన్న వారికి, రావాలని కోరుకునే వారికి ఆయన రోల్ మోడల్. ఎస్వీ ప్రసాద్, శ్రీలక్ష్మి జంట ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. విధి విచిత్రమో, దైవలీలో గానీ మరణంలోనూ వారి సాన్నిహిత్యం వీడలేదు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి.
వ్యాసకర్త: ఎ. చంద్రశేఖర రెడ్డి
సీఈఓ, ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్
పదవులకు వన్నెతెచ్చిన అధికారి
Published Sun, Jun 6 2021 1:52 AM | Last Updated on Sun, Jun 6 2021 1:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment