సీఎస్ పేరుతో సృష్టించిన నకిలీ జీవో
సాక్షి, హైదరాబాద్: నకిలీ ఉద్యోగాలు.. నకిలీ నోట్లు.. నకిలీ ఎరువులు, విత్తనాలే కాదు.. ఏకంగా నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు సృష్టిస్తున్నారు కేటుగాళ్లు. లబ్ధి కోసం ప్రభుత్వ సీఎస్ పేరిటే నకిలీ ఉత్తర్వులు సృష్టించి దాంతో ప్రభుత్వ అధికారులనే బురిడీ కొట్టించే ప్రయ త్నం చేస్తున్నారు. తాజాగా సెక్రటేరియట్‌లో అలాంటి వ్యవహారమే వెలుగుచూసింది. సకాలంలో పనులు చేయకపోయిన కారణంగా విజిలెన్స్ శాఖ సిఫార్సు చేసిన పెనాల్టీని మాఫీ చేసేందుకు ఏకంగా నకిలీ ఉత్తర్వులను సృష్టించారు. అధికారుల ముందుచూపుతో ఇది ప్రాథమిక స్థాయిలోనే బయటపడటం, అది సీసీఎస్ దర్యాప్తు వరకు వెళ్లడం చర్చనీయాంశమైంది.
జీవో ఉద్దేశమిదీ..: నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులను వరల్డ్‌బ్యాంకు నిధులతో ఇరిగేషన్ శాఖ చేపట్టింది. దీంతో ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ పరిధిలోని డీసీ–8 ప్యాకేజీ పనులను చేపట్టారు. ఈ పనులను సుదర్శన్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ చేపట్టగా, ఆయన మరణంతో పనులు నిలిచిపోయాయి. తర్వాత ప్రాజెక్టు పనులను ఇతర కాంట్రాక్టర్‌కు ఇచ్చి పనులు పూర్తి చేయించారు. అయితే ఈ పనులపై విచారణ జరిపిన విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ పనులు పూర్తికాని నేపథ్యంలో కాంట్రాక్టర్ నుంచి లిక్విడేటీవ్ డ్యామేజెస్ చార్జీ (ఎల్‌డీసీ) కింద రూ.88.21 లక్షలు పెనాల్టీ కింద వసూలు చేయాలని నీటి పారుదల శాఖకు సూచించింది. పనుల పూర్తి విషయంలో కాంట్రాక్టర్ తప్పులేదని, శాఖ పొడగించిన గడువు మేరకు పనులు పూర్తి చేసి కాల్వలకు నీళ్లిచ్చారని తెలిపింది. పెనాల్టీని రద్దు చేయాలని కోరుతూ నీటి పారుదల శాఖ ప్రభుత్వాన్ని కోరింది. అయితే దీనిపై ప్రభుత్వం ఏæ నిర్ణయం చేయలేదు. నీటిపారుదల శాఖ సిఫార్సు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉండగానే ఈ నెల 25న ప్రభుత్వం పెనాల్టీ మాఫీ చేస్తున్నట్లు స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషి పేరిట జీవో 2136 విడుదలైంది.
గుర్తించారిలా.. ఈ జీవో కాఫీని పట్టుకొని ఈ నెల 26న కొందరు వ్యక్తులు బీఆర్‌కేఆర్ భవన్‌లోని సెక్షన్ అధికారులను కలిసి ఉత్తర్వులను అమలు చేయాలని కోరినట్లుగా తెలిసింది. అయితే వాళ్లెవరనేది ఇంకా తెలియలేదు. ఈ క్రమంలో జీవో అంశం ఇరిగేషన్ శాఖ డిప్యూటీ సెక్రటరీ సుబ్బమ్మ దృష్టికి వెళ్లింది. అయితే జీవో కాపీపైన తెలంగాణ ప్రభుత్వం చిహ్నం ఉంది. సాధారణ జీవోల్లో అలాంటి చిహ్నం ఉండదు. అలాగే ఎస్‌కే జోషి పేరు మీద ఏ జీవో ఇచ్చినా, పూర్తి పేరు శైలేంద్రకుమార్ జోషి అనే పేరుతో విడుదలవుతాయి. అదీగాక జీవో నంబర్: 2136గా పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో జీవోల సీరియల్ నంబర్ 854 వద్దే ఉంది. ఈ ఆధారాలతో దాన్ని నకిలీ జీవోగా గుర్తించిన సుబ్బమ్మ సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు సుబ్బమ్మ గురువారం రాత్రి సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు గురువారం కేసు నమోదు (ఎఫ్‌ఐఆర్ నెం.205) చేశారు. ప్రాథమికంగా ఏ కాంట్రాక్టర్‌ను ఉద్దేశించి ఆ జీవో జారీ అయిందో దృష్టి పెట్టారు. శుక్రవారం ప్రాథమిక ఆధారాలు సేకరించిన దర్యాప్తు అధి కారులు శనివారం నోటీసులు జారీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment