కొత్త విజ్ఞప్తులు స్వీకరించొద్దు
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై అధికారులకు సీఎస్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ప్రజల నుంచి వచ్చిన ప్రతీ విజ్ఞప్తిని క్షుణ్నంగా పరిశీలించి తుది నోటిఫికేషన్ ఇచ్చినందున జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ముగిసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులకు స్పష్టత ఇచ్చారు. తుది నోటిఫికేషన్ ప్రకారం కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటయ్యాయని, దీని ప్రకారమే పాలన జరుగుతుందని, ఇంకా మార్పులు చేర్పులకు ఏ మాత్రం అవకాశం లేదని, ఏవైనా విజ్ఞప్తులు వచ్చినా స్వీకరించొద్దని ఆయన ఆదేశించారు.
జిల్లాల ఏర్పాటు ప్రక్రియ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆయన బుధవారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. దాదాపు ఏడాది పాటు వివిధ స్థాయిల్లో అత్యంత లోతుగా చేసిన కసరత్తు ఫలితంగా కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు, పోలీసు కమిషనరేట్లు, పోలీస్ సబ్-డివిజన్లు, సర్కిల్ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్ల కూర్పు అద్భుతంగా జరిగిందని అభిప్రాయపడ్డారు. ఇక మరింత బాగా పనిచేసే అంశాలపై దృష్టిపెట్టాలని సీఎస్ కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు.