హైదరాబాద్: ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013’కు సంబంధించి తుది ప్రక్రియ ముగిసింది. బిల్లుపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను, సీఎం ప్రతిపాదించిన తిరస్కరణ తీర్మానాన్ని వేర్వేరుగా ప్రత్యేక విమానంలో సోమవారం హస్తినకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. సీఎస్ పర్యవేక్షణలో టి.బిల్లుకు తుది మెరుగులు దిద్దిన అధికారులు అసెంబ్లీ అభిప్రాయాలను జత చేసి రేపు ఢిల్లీకి పంపనున్నారు. రేపు ఉదయం 9.40 గం.లకు ఉన్నతాధికారులు టి.బిల్లును విమానంలో ఢిల్లీకి తీసుకువెళ్లనున్నారు.
రాష్ట్రపతి నుంచి వచ్చిన తెలంగాణ బిల్లుపై గత నెల 30వ తేదీ వరకు అసెంబ్లీలో చర్చ జరిగింది. శాసనసభ, మండలిలో వ్యక్తమైన అభిప్రాయాలను శాసనసభ సచివాలయ అధికారులు గత రెండు రోజులుగా క్రోడీకరించి సమగ్ర నివేదికను రూపొందించారు. శనివారం సాయంత్రం దానికి తుది మెరుగులు దిద్ది శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముందుంచారు.