సాక్షి, అమరావతి : అర్హులందరికీ నవరత్న పథకాలను సంతృప్త స్థాయిలో అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ బాటలోనే కేంద్రం పయనిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పథకాన్నీ అర్హతే ప్రామాణికంగా, వివక్షకు తావు లేకుండా సంతృప్త స్థాయిలో అందిస్తోంది. ఒక వేళ పొరపాటున అర్హులైన వారికి ఏ పథకం అయినా అందకపోయినా ఏడాదిలో రెండు సార్లు అలాంటి వారి కోసం అవకాశం కల్పింస్తోంది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హులైన మిగిలిన వారు దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలన చేసి ఏడాదిలో రెండు సార్లు పథకాల ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలనూ దేశవ్యాప్తంగా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో అందించేందుకు దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఇందులో భాగంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 15న తొలుత దేశ వ్యాప్తంగా 110 గిరిజన జిల్లాల్లో ప్రారంభిస్తారు. మిగతా జిల్లాల్లో నవంబర్ మూడో వారం నుంచి ప్రారంభించనున్నారు. ఇటీవలే కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సీఎస్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు.
తగిన చర్యలు తీసుకోండి : సీఎస్ జవహర్‌రెడ్డి
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డి శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచారానికి రాష్ట్రంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. యాత్ర సమన్వయం కోసం రాష్ట్ర స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, అలాగే సీఎస్ అధ్యక్షతన గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్, వ్యవసాయ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
జిల్లా స్థాయిలో సీనియర్ అధికారి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామ, పంచాయతీలు, గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా వికసిత్ యాత్ర ప్రచార కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని సూచించారు. వారంలో 14 గ్రామ పంచాయతీలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ యాత్ర కొనసాగేలాగ ప్రణాళికను రూపొందించడంతో పాటు ఆ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వ ఐటీ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు.
పంచాయతీ కార్యదర్శి, వార్డు కార్యదర్శిని నోడల్ అధికారిగా నియమించాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వమే ఆడియో, వీడియోతో కూడిన ఎల్‌ఈడీ స్క్రీన్ మొబైల్ వాహనాలతో పాటు ప్రచార సామగ్రి సరఫరా చేస్తుందని, వీటిని క్షేత్రస్థాయిలో చేరవేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లను వినియోగించుకోవాలని సీఎస్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment