తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ రాజీవ్ శర్మ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ రాజీవ్ శర్మ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1982 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ శర్మ పలు కీలక శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన రూర్కీలో ఐఐటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ చేశారు. తరవాత ఇంగ్లండ్‌లోని అంగీలియాలో గ్రామీణాభివృద్ధిలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. అమెరికాలోని మిలన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేశారు. 1982లో ఐఏఎస్‌గా ఎంపికై ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వచ్చారు.
కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్‌గా, డెరైక్టర్ పోర్ట్స్, పురపాలక శాఖ స్పెషల్ కమిషనర్, సాంకేతిక విద్య డెరైక్టర్, వ్యవసాయ శాఖ కమిషనర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్య కార్యదర్శి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డెరైక్టర్ జనరల్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శిగా పని చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో కీలక భూమిక పోషించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అవసరమైన సమాచారాన్ని అందించడమేకాక, ఆ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరించారు.
అలాగే తొలి డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా అనురాగ్‌శర్మ కూడా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ డీజీపీగా ఈరోజు ఉదయం 7.15కు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఐవైఆర్ కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు.