హైదరాబాద్ నగరంలో 30వేల మంది నిరుపేదల గృహ నిర్మాణానికి సంబంధించిన నిధుల విడుదలపై పరిశ్రమలు, పురపాలన శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో చేపట్టనున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పథకంతో పాటు.. పెండింగులో వున్న వాంబే, జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకాల నిధులపై చర్చించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసినా.. భవనాల ఎత్తు, యూనిట్ ధరకు సంబంధించిన ప్రత్యేక మినహాయింపులపై స్పష్టత ఇవ్వాల్సి వుందని కేటీఆర్ ప్రస్తావించారు. మినహాయింపులపై త్వరలో సీఎంతో చర్చించి మార్గదర్శకాలు జారీ చేస్తామని సీఎస్ వెల్లడించారు. మెట్రో రైలు పనుల పురోగతిపై చర్చిస్తూ.. మెట్రోకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల్లో కొంత మొత్తాన్ని వారంలోగా విడుదల చేయాలని ఆర్దిక శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. మున్సిపల్ విభాగంలోని పలు పథకాలకు హడ్కో తదితర ఆర్దిక సంస్థల నుంచి ఆర్దిక సహాయం కోరడంపై మంత్రి కేటీఆర్‌తో చర్చించారు.