'తెలంగాణ విజయరహస్యం ఇదే..'
మహిళా ఉద్యోగుల జాతీయ సదస్సులో సీఎస్ రాజీవ్‌శర్మ
హన్మకొండ, అర్బన్: పోరాటాలు, ఉద్యమాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమనేత ముఖ్యమంత్రిగా ఉండటంవల్ల రాష్ట్రంలో బ్యూరోక్రాట్లు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు కలిసి పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకు వెళ్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్నారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన వరంగల్ నిట్‌లో జరిగిన అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల సమాఖ్య 5వ జాతీయ మహిళా ఉద్యోగుల సదస్సులో మాట్లాడారు.
తెలంగాణ అభివృద్ధి కోసం అందరూ చేస్తున్న టీం వర్క్‌తోనే రాష్ట్రం దేశాన్ని ఆకర్షిస్తున్నదన్నారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మొదటిసారిగా పోలీస్ నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని రాజీవ్‌శర్మ అన్నారు. షీ టీమ్స్ వంటివి ఏర్పాటు చేయడంతో మహిళా ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు. త్వరలో ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా సమస్యల పరిష్కారం, రక్షణకోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తామని, ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో సదుపాయాలు కల్పిస్తామని రాజీవ్ శర్మ అన్నారు.
మిషన్ కాకతీయ చెరువుల పరిశీలన
దుగ్గొండి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శనివారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ముద్దునూరు గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన ఊరచెరువు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. చెరువు సమీపంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధికోరుతున్నా రు..పాలన ఎలా ఉండాలనుకుంటున్నారు.. ఏమి చేస్తే మీ జీవితాలు బాగుపడతాయో సలహాలు ఇవ్వాలని ప్రజలను కోరారు.
తయారీ మానేసిన వారికి సాయం
ముద్దునూరుని మద్యరహిత గ్రామంగా తీర్చిదిద్దిన నేపథ్యంలో అక్కడి మహిళలతో సీఎస్ చాలా సేపు సంభాషించారు. గుడుంబాపై ఆధారపడి.. ప్రస్తుతం ఆ వృత్తి మానేసిన నాలుగు కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. గుప్పెడు బియ్యం పథకంలో భాగంగా మహిళలు సేకరించిన బియ్యాన్ని పేదలకు అందించి, మహిళలను అభినందించారు. అలాగే, దళిత మహిళలకు భూ పంపిణీ పథకంలో భాగంగా గ్రామంలోని 25.12 ఎకరాల భూమిని రూ.1.36 కోట్లు వెచ్చించి ప్రభుత్వం కొనుగోలు చేయగా, సీఎస్ పరిశీలించారు.