కొత్త సీఎస్‌గా నియమితులైన సోమేశ్‌కుమార్‌ను అభినందిస్తున్న మాజీ సీఎస్ జోషి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఆయన నియామక ఫైలుపై మంగళవారం సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. ఆ వెంటనే రాష్ట్ర సాధారణ పరి పాలన శాఖ ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. 2018 ఫిబ్రవరి 1 నుంచి సీఎస్‌గా కొనసాగుతున్న శైలేంద్ర కుమార్ జోషి మంగళవారం పదవీ విరమణ చేశారు. దీంతో వెంటనే 1989 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన సోమేశ్.. కొత్త సీఎస్ గా బాధ్యతలు తీసుకున్నారు.
2020 జనవరి 1 నుంచి పదవీ విరమణ రోజైన 2023 డిసెంబర్ 31 వరకు సోమేశ్ కుమార్ సీఎస్‌గా కొనసాగుతారు. ఎక్కువకాలం పాటు బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉండటంతోనే సోమేశ్‌కుమార్‌ను సీఎస్‌గా ఎంపిక చేసినట్లు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో పాలనలో స్థిరత్వం ఉంటుందని పేర్కొంది. సీఎస్‌గా పదవీ విరమణ చేసిన ఎస్‌కే జోషిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటిపారుదల వ్యవహారాలు)గా నియమించాలని సీఎం నిర్ణయించారు. కాగా, తనను సీఎస్‌గా నియమించినందుకు సోమేశ్ కుమార్ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
శాఖల పనితీరుపై అసంతృప్తితోనే?: రాష్ట్రం ఆవిర్భవించి ఆరేళ్లయినా పలు కీలక ప్రభుత్వ శాఖలు, విభాగాల పనితీరు గాడిలో పడకపోవడంపై సీఎం అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన వ్యవహారాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఆశించిన లక్ష్యాల సాధన కోసం పాలన యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాలనే ఆలోనతోనే సీఎస్‌గా సోమేశ్‌ను ఎంపిక చేసినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సీఎంకు నాపై నమ్మకముంది: సీఎం కేసీఆర్ ఆశయాలు, ఆదేశాలకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వ లక్ష్య సాధనకు కృషి చేస్తానని నూతన సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. సీఎంకు తనపై నమ్మకముందని, దాన్ని నిలబెట్టుకుంటానన్నారు. మంగళవారం సాయం త్రం తాత్కాలిక సచివాలయంలో సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను నిర్ధిష్ట కాలవ్యవధిలో పూర్తి చేసేలా కృషి చేస్తానని చెప్పారు. ఉద్యోగులతో స్నేహపూరితంగా వ్యవహరిస్తానని, అదే సమయంలో పని విషయంలో రాజీ పడబోనన్నారు. ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయంతో పని చేస్తానన్నారు. పదవీ విరమణ పొందిన ఎస్‌కే జోషి సలహా సూచనలివ్వాలని కోరారు.
సైకాలజిస్ట్ నుంచి సీఎస్‌గా..: సోమేశ్‌కుమార్.. 1987 నవంబర్ నుంచి 1989 వరకు డీఆర్డీవో సైకాలజిస్టుగా సాయుధ బలగాల అధికారుల ఎంపిక కోసం మానసిక పరీక్షలు నిర్వహించేవారు.
ఎస్‌కే జోషికి ఘనంగా వీడ్కోలు..: పదవీ విరమణ చేసిన సీఎస్ ఎస్‌కే జోషికి సీనియర్, ఐపీఎస్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీఆర్‌కేఆర్ భవన్‌లోని సమావేశ మందిరంలో ఆయనను ఘనంగా సత్కరించారు. పోలీసు శాఖకు జోషి అందించిన సహకారం మరువలేనిదని డీజీపీ మహేందర్‌రెడ్డి కొనియాడారు.
చదువు.. కొలువు
పుట్టిన తేదీ, ప్రాంతం: 22.12.1963, బిహార్
విద్య: ఎంఏ (సైకాలజీ), ఢిల్లీ యూనివర్సిటీ
భార్య: డాక్టర్ జ్ఞాన్ముద్ర, పీహెచ్‌డీ, డీన్ అండ్ ప్రొఫెసర్, ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్
కుమార్తె: సాయి గరిమా, ఆర్ట్స్ విద్యార్థిని
ఐఏఎస్‌గా తొలి కొలువు: నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్‌కలెక్టర్ (ఆగస్టు 1991– మే 93)
►ఐటీడీఏ, పాడేరు ప్రాజెక్టు ఆఫీసర్‌గా 1993 మే నుంచి 1995 ఏప్రిల్ వరకు
►హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్‌గా 1995 మే– 1996 జూన్ వరకు
►యాక్షన్ ఎయిడ్ ఇండియా డైరెక్టర్/వ్యవస్థాపక సీఈవోగా 1996 జూన్ – 2000 జనవరి వరకు
►అనంతపురం జిల్లా కలెక్టర్‌గా జూన్ 2000 నుంచి 02 డిసెంబర్ వరకు
►ఏపీ అర్బన్ సర్వీస్ ఫర్ పూర్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌గా జనవరి 2003 నుంచి మే 2005 వరకు
►ఎయిడ్ ఎట్ యాక్షన్ దక్షిణాసియా రీజనల్ డైరెక్టర్‌గా మే 2005 నుంచి డిసెంబర్ 2009 వరకు
►ఏపీ కళాశాల విద్య కమిషనర్‌గా జూలై 2008 నుంచి డిసెంబర్ 2009 వరకు
►గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌గా డిసెంబర్ 2011 నుంచి అక్టోబర్ 2013 వరకు
►జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా అక్టోబర్ 2013 నుంచి అక్టోబర్ 2015 వరకు
►గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా నవంబర్ 2015 నుంచి డిసెంబర్ 2016 వరకు
►రెవెన్యూ, రెవెన్యూ, సీసీఎల్‌ఏ, రెరా, కమర్షియల్ ట్యాక్స్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా డిసెంబర్ 2016 నుంచి ఇప్పటి వరకు
సోమేశ్ వద్దే రెవెన్యూ శాఖ
రెవెన్యూ, సీసీఎల్‌ఏ, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇంత కాలం పనిచేసిన సోమేశ్‌కుమార్.. సీఎస్‌గా నియమితులైనా కూడా ఆ శాఖలను ఆయన వద్దే ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. కాగా, సీఎస్ ఎస్‌కే జోషి వద్ద ఉన్న నీటిపారుదల శాఖను మరో సీనియర్ ఐఏఎస్‌కు అప్పగించనుంది.
Comments
Please login to add a commentAdd a comment