మంథనిలో...
►బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 29.48, కరీంనగర్ జిల్లా అర్ణకొండలో 23 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.
►ఏటా నైరుతి సీజన్‌లో 72.58 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాలి. ఈసారి జూలై రెండో వారం నాటికే 52.49 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
►గోదావరిలో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ ప్రవాహాలు నమోదవుతున్నాయి. పరీవాహక ప్రాంతం వెంట 223 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి 19,071 మందిని తరలించారు.
►భద్రాచలంలో 1986లో 76 అడుగులతో గోదావరి ప్రవహించగా.. 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఆ స్థాయిలో వరద పోటెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
►శ్రీరాంసాగర్‌లోకి వరద తగ్గుముఖం పట్టింది.
►కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ బ్యారేజీ
కంట్రోల్ రూమ్‌లో 12 మంది ఇరిగేషన్ ఇంజనీర్లు వరదలో చిక్కుకున్నారు.
►లక్ష్మీ బ్యారేజీ వద్ద ఉన్న పలిమెల పోలీస్‌స్టేషన్‌ను వరద చుట్టుముట్టింది. దీంతో 70 మంది సీఆర్‌పీఎఫ్, 20 మంది టీఎస్‌ఎస్పీ సిబ్బంది ఇంజనీర్ల క్వార్టర్ల వద్ద తలదాచుకున్నారు.
►అల్పపీడనం బలహీనపడటంతో గురువారం మధ్యాహ్నం నుంచి వానలు తగ్గాయి.
►రాష్ట్రం రెడ్ అలర్ట్ నుంచి బయటపడింది.
►9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.
►రుతుపవనాలు చురుగ్గా ఉండటం, ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటం వల్ల మరో రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రాన్ని గోదావరి వరద వణికిస్తోంది. ఎగువన మహారాష్ట్ర నుంచి కింద ఆంధ్రా వరకు ఉప్పొంగి ప్రవహిస్తూ ఊళ్లకు ఊళ్లను నీట ముంచుతోంది. నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాచలం జిల్లాల్లో గోదావరి, ఉప నదుల బీభత్సంతో జన జీవనం అతలాకుతలమైంది. చాలాచోట్ల రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
జూలై నెలలోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం చరిత్రలోనే తొలిసారికాగా.. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఏకంగా 13 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దానికి ప్రాణహిత, ఇతర ఉప నదులు, వాగుల నీరుకలిసి.. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ ప్రాజెక్టులు సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఎల్లంపల్లి నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతాలు జలమయం అయ్యాయి. అన్నారం, కన్నెపల్లి పంపుహౌస్‌లు నీట మునిగాయి. ముంపు ప్రాంతాల నుంచి 19 వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. గోదావరి పరీవాహక ప్రాంతమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించినట్టు తెలిపారు.
25 గ్రామాలు జల దిగ్బంధం: గోదావరి మహోగ్ర రూపంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, పలిమెల మండలాల్లో 25 గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాళేశ్వరం వద్ద నీటిమట్టం 16.80 మీటర్ల ఎత్తుకు చేరడంతో.. పుష్కర ఘాట్లు మునిగిపోయి సంగమేశ్వర ఆలయం దాకా నీరు వచ్చింది. ముంపు ప్రాంతాల వారిని బోట్లలో బయటికి తీసుకువస్తున్నారు.
అంధకారంలో ఏజెన్సీ: గోదావరి వరద పోటెత్తడంతో చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గోదావరిలో ఇన్‌టేక్ వెల్స్ మునిగిపోవడంతో మంచి నీటి సరఫరా కూడా లేకుండా పోయింది. వరద ప్రమాదం నేపథ్యంలో ప్రజల కదలికలపై అధికారులు ఆంక్షలు విధించారు. భద్రాచలం పట్టణంతోపాటు బూర్గంపాడు మండలంలో గురువారం మధ్యాహ్నం నుంచి 144 సెక్షన్‌ను అమల్లోకి తెచ్చారు. అత్యవసరమైతేనే తప్ప ఎవరూ ఇళ్లలోంచి బయటికి రావొద్దని హెచ్చరించారు. చర్ల– దుమ్ముగూడెం– భద్రాచలం, బూర్గంపాడు– సారపాక దారిలో చాలా చోట్ల గోదావరి వరద రోడ్లపైకి చేరి.. రాకపోకలు నిలిచిపోయాయి. దీనితో మంత్రి పువ్వాడ అజయ్ దుమ్ముగూడెం పర్యటనను రద్దు చేసుకున్నారు.
గంగమ్మ శాంతించాలని కోడి కోసి మొక్కు తీర్చుకుంటున్న ముంపు బాధితులు
ఎస్సారెస్పీలోకి తగ్గిన వరద
గోదావరి దిగువన పోటెత్తుతుంటే.. ఎగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టుకు బుధవారం గరిష్టంగా 4.2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాగా.. గురువారం సాయంత్రానికి 2.5 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు నుంచి 36 గేట్ల ద్వారా అదే మొత్తంలో నీటిని వదులుతున్నారు. కాల్వల ద్వారా మరింత నీటిని విడుదల చేస్తున్నారు.
నీట మునిగినరామగుండం, మంథని..
గోదావరి ఉగ్రరూపంతో పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్, మంథని మున్సిపాలిటీ జలమయం కాగా.. గోదావరి పరీవాహక గ్రామాలు నీటమునిగాయి. బాధితులను పునరావాస శిబిరాలకు తరలించారు. గోదావరిఖని వద్ద బ్రిడ్జి నీట మునగడంతో మంచిర్యాల–పెద్దపల్లి మధ్య రాకపోకలు నిలిపివేశారు. మంథని పట్టణం మీదుగా ప్రవహించి గోదావరిలో కలిసే బొక్కలవాగులో వరద వెనక్కి తన్నడంతో మంథని పట్టణంలోని చాలా భాగం జలమయమైంది.
36 ఏళ్ల తర్వాత...
చివరిసారిగా 1986లో భద్రాచలం వద్ద 76 అడుగుల ఎత్తుతో అత్యంత భారీ వరద వచ్చింది. ఆ సమయంలో భద్రాచలంతోపాటు చుట్టుపక్కల గ్రామాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోదావరిపై భద్రాచలం–సారపాక వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. మళ్లీ సుమారు 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి ఆ వంతెనపై రాకపోకలు ఆగిపోయాయి. ఎగువన మేడిగడ్డ నుంచి వస్తున్న 28 లక్షల క్యూసెక్కుల వరద శుక్రవారం ఉదయం సమయానికి భద్రాచలం చేరుకోనుంది. దానికితోడు శబరి ఎగువ ప్రాంతంలో వర్షాలతో ఆ వరద కూడా వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా. దీనితో ముంపుపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే.. 2002 గోదావరి పుష్కరాల సందర్భంగా భద్రాచలంలో కరకట్టను నిర్మించారు. 1986 నాటి వరదను దృష్టిలో పెట్టుకుని, అంతకన్నా ఎక్కువగా 83 అడుగుల వరదనూ తట్టుకునేలా డిజైన్ తయారు చేశారు. అది రక్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. కాగా అసాధారణ వరద నుంచి ప్రజలను కాపాడాలంటూ గురువారం
మంత్రి పువ్వాడ అజయ్ భద్రాద్రి సీతారాములకు ప్రత్యేక పూజలు చేశారు.
ఏటూరు నాగారంలో నీట మునిగిన ఓడవాడ గ్రామం
సమీక్షించిన సీఎస్
భారీ వర్షాలు, గోదావరి వరద, సహాయ కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం అధికారులతో సమీక్షించారు. జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని సీఎస్ తెలిపారు. రాష్ట్రంలో 223 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి 19,071 మందికి పునరావాసం కల్పించామన్నారు.
వరదపై కేసీఆర్ ఆరా
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి పువ్వాడ అజయ్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సూచించారు.
మంచిర్యాల విలవిల
గోదావరి వరదతో మంచిర్యాల జిల్లా కేంద్రం విలవిల్లాడిపోతోంది. రాళ్లవాగు మీదుగా గోదావరి నీళ్లు పైకి ఎగబాకడంతో.. కాలేజీ రోడ్డు, ఎన్టీఆర్ కాలనీ, ఎల్‌ఐసీ, పద్మశాలీ, గణేశ్ నగర్, బైపాస్ రోడ్డు, తెలంగాణ తల్లి చౌక్ వరకు వరద నీరు వచ్చింది. అధికారులు ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోదావరిఖని–మంచిర్యాల, మంచిర్యాల–లక్సెట్టిపేట మధ్య రహదారులపై వరద పోటెత్తడంతో రాకపోకలను నిలిపివేశారు. వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. మంచిర్యాల ఎల్‌ఐసీ కాలనీలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు నివాసాన్ని వరద చుట్టుముట్టింది. దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. నిర్మల్ జిల్లాలో బాసర, భైంసా, నిర్మల్ పట్టణాలు నీట మునిగాయి. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నర్సింహస్వామి దేవాలయం సమీపం వరకు నీరు రావడంతో.. సమీప కాలనీల వారిని పునరావాస శిబిరాలకు తరలించారు.
జలదిగ్బంధంలో భద్రాద్రి
గట్టు తెగిన గోదావరి తీర ప్రాంతాలను ముంచెత్తుతూ భద్రాచలం పట్టణాన్ని చుట్టుముట్టింది. రహదారులను ముంచేస్తూ ఇళ్లదాకా వరద పోటెత్తింది. పట్టణానికి తూర్పున కూనవరం రోడ్డు, పశ్చిమాన చర్ల రహదారిపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి బ్రిడ్జిపై రాకపోకలను గురువారం సాయంత్రం నుంచి 48 గంటలపాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దీనితో హైదరాబాద్‌తోపాటు ఒడిశా, ఏపీ, ఛత్తీస్‌గఢ్ వైపు రాకపోకలు నిలిచిపోయి.. భద్రాచలం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఏజెన్సీ, ముంపు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజలు ఎప్పుడేం అవుతుందోనన్న ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముంపు గ్రామాల నుంచి 8,984 మందిని సహాయ శిబిరాలకు తరలించారు. 64 అడుగుల వరద అంచనాతో ఏర్పాటు చేసిన పలు పునరావాస కేంద్రాల్లోకీ వరద నీరు చేరుకుంది. దీంతో అప్పటికప్పుడు కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment