అచ్చంపేట రూరల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల వెన్ను విరుస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, పంటలకు మద్దతు ధర కల్పించాలంటూ నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘రాజీవ్ రైతు భరోసా’పేరిట ఆదివారం ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల కోసం పాదయాత్ర చేపట్టారని, కేంద్రం నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ తానూ ఇప్పుడు అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపడుతున్నానని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు భూములను పంపిణీ చేసి రైతులకు వెన్నుదన్నుగా నిలిచిందన్నారు.
కమీషన్లకు కక్కుర్తి పడి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. మొదట్లో ఈ చట్టాలను వ్యతిరేకించినట్టు నటించిన సీఎం కేసీఆర్ అనంతరం ప్రధానితో జోడీ కట్టారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోనూ కొనుగోలు కేంద్రాలు ఎత్తేసి రైతులకు గిట్టుబాటు ధర దక్కకుండా చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దీక్ష విరమణ అనంతరం రేవంత్ అచ్చంపేట నుంచి ఉప్పునుంతల మీదుగా హైదరాబాద్‌కు పాదయాత్ర ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment