ఊరిలో ‘ఉపాధి’ లేక.. పనులు చూపేవారు లేక బతుకుజీవుడా..అంటూ నల్లమల చెంచుపెంటలు వలసబాట పట్టాయి. తాళం వేసిన ఇళ్లతో ఆ గిరిజన పల్లెలు బోసిపోయి కనిపిస్తున్నాయి. మరోవైపు బతుకుదెరువు కోసం ఊరువిడిచి వెళ్లిన గిరిజన కూలీలు గుంపుమేస్త్రీల దాష్టీకానికి బలవుతున్నారు. రోజుల తరబడి పనులు చేయించుకొని కూలిడబ్బులు ఇవ్వకుండా తరిమేస్తున్నారు. ఆదుకోవాల్సిన ఐటీడీఏ అధికారులు నిస్సహాయస్థితిలో ఉన్నారు..
అచ్చంపేట, న్యూస్‌లైన్: నల్లమల చెంచులకు ఉపాధి లేకపోవడంతో పిల్లాపాపలతో వలసబాట పట్టారు. మహారాష్ట్ర, ముంబాయి, అంబర్‌నాత్, షోలాపూర్, గుజరాత్‌లోని సూరంత, గోవా, బెంగళూరు, హైదరాబాద్, ప్రకాశం తదితర ప్రాంతాలకు ఇప్పటికే వెళ్లారు. వీరికి గుంపుమేస్త్రీలు అడ్వాన్స్‌ల రూపంలో కొంతచెల్లించి రోజుల తరబడి పనులు చేయించుకుంటున్నారు. వీరికోసం ప్రత్యేక ఐటీడీఏ ఉన్నా పట్టించుకోవడం లేదు. స్థానికంగా చేపల పెంపకంతో ఉపాధి కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా ముందుకుసాగడం లేదు. వలసల నివారణ కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చెంచులకు పదిహేను రోజుల పాటు ప్రత్యేక ఉపాధి కల్పిస్తూ ఉన్న చోటపని కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ పథకంతో 95 శాతం మేర చెంచులు వలసలకు స్వస్తి పలికి ఉన్నచోటే ఉపాధి పనులు చేస్తూ ఇబ్బందులు లేకుండా కాలం గడిపారు. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ పనులు కూడా సక్రమంగా జరగడం లేదు.
చేసేది లేక అడవిబిడ్డయి వలసబాట పట్టారు. ఇప్పటికే నల్లమల నుంచి ఇప్పటికే మొత్తం 350 చెంచు కుటుంబాలు వివిధ ప్రాంతాలకు వెళ్లాయి. అచ్చంపేట మండలం చౌటపల్లి, చందాపూర్ చెంచుకాలనీ, బొమ్మనపల్లి చెంచుకాలనీ, ఐనోలు, సిద్దాపూర్, రంగాపూర్, మండలంలో బిల్లకల్, బాణాల, బల్మూర్, చెంచుగూడెం, కొండనాగుల, గుడిబండ, అంబగిరి, రామాజిపల్లి, జాగాల, గ్రామాల్లో 450 చెంచు కుటుంబాల్లో 1260 మంది నివాసం ఉంటున్నారు.
వీరిలో ఈఏడాది ఇప్పటివరకు సుమారు 150 చెంచు కుటుంబాలకు చెందిన 400 మంది గుంపుమేస్త్రీల వెంట ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్, మొల్కమామిడి, మాచారం, కుడిచింతలబైలు, పదర, సార్లపల్లి, కొలంపెంట, మారడుగు, జంగంరెడ్డిపల్లి, ఉప్పునుంతల (బీకే) మాధవానిపల్లి, లింగాల మండలం పద్మనపల్లి, ఎర్రపెంట, పాతధారారం, అప్పాయిపల్లి, శ్రీరంగాపూర్, రాయవరం, పాతరాయవరం, చెన్నంపల్లి చెంచులపెంటల నుంచి ఇప్పటికే వలసవెళ్లారు.
‘ఉపాధి’ నిరుపయోగమే..
చెంచుల వలసల నివారణ కోసం ఐటీడీఏ ప్రత్యేక ఉపాధి హామీ పథకం అమలుచేస్తున్నా మూడునెలలుగా పనులు జరగడం లేదు. ఈ పథకం ద్వారా సొంతూళ్లలోనే పనులు చూపుతూ కూలీలకు డబ్బులు ముందస్తుగా చెల్లించేవారు.
పనులు చేయించాల్సిన బాధ్యతను మహిళా సంఘాల సభ్యులకు అప్పగించారు. ఒకవేళ కూలీలు పనికి రాకపోతే తీసుకొచ్చే బాధ్యతను వారికే ఇచ్చారు. అలాగే నీటివసతి ఉన్న భూముల్లో పండ్లతోటల పెంపకాన్ని ప్రోత్సహించారు. ఆయా పెంటలు, గ్రామాల్లో ఎంతమంది చెంచులు ఉన్నా వారందరికీ ప్రత్యేక ఉపాధి పథకంలో భాగస్వాములను చేయాల్సి ఉంది. అయితే ఐటీడీఏ నిర్లక్ష్యం కారణంగా పనులు జరగకపోవడం..పోషణభారంగా మారడంతో చెంచులు వలసబాటను ఎంచుకున్నారు. అయితే ఇదే అదనుగా భావించి గుంపుమేస్త్రీలు చెంచు గిరిజనుల కష్టాన్ని సొమ్ము చే సుకుంటున్నారు. పనులు చేయించుకుని డ బ్బులు ఇవ్వకుండానే తరిమేస్తున్నారు.
పనిలేక మూణ్నెళ్లు అయింది
పనులు లేక మూడు నెలలు కావస్తుంది. మాగూడెంలో ఇప్పటికే ఆరు కుటుంబాలు వలసలు పోయాయి. పనులు లేక ఇళ్ల ద గ్గరనే ఉంటున్నాం. తిండి తిప్పలకు ఇబ్బందులు పడుతున్నాం. ఐటీడీఏ వాళ్లు పనులను చేయించి ఆదెరువు చూపించాలి.
- మర్రిపల్లి ఉస్సేనమ్మ,
గుడిబండ,బల్మూర్ మండలం
వలసలు తగ్గాయి..
ఉపాధి హామీ వచ్చిన తర్వాత చెంచుల వలసలు తగ్గాయి. అక్కడక్కడ ఒకరిద్దరు మాత్రమే అక్కడక్కడ వలసలు వెళ్లినట్లు నా దృష్టికి వచ్చింది. ఏడాది పొడవునా పనులు కల్పిస్తున్నాం. ఇదివరకు మాదిరిగా పనులు చేయకపోయినా అడ్వాన్స్‌గా డబ్బుఇవ్వడం లేదు. వలసలు వెళ్లినట్లు మాకు డాటా ఇవ్వగలిగితే పరిశీలిస్తాం. వలసలపై వీటీడీఏల సమావేశంలో అడిగాం..అలాంటిదేమీ లేదన్నారు.
- ప్రభాకర్‌రెడ్డి, పీఓ ఐటీడీఏ సున్నిపెంట
‘ఉపాధి’ లేక ఊరు విడిచి..
Published Sun, Jan 5 2014 3:33 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement
Advertisement