సాక్షి, అచ్చంపేట్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ అచ్చంపేటలో బీఆర్‌ఎస్ ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌కు, కాంగ్రెస్‌కు కేసీఆర్ స్ట్రాంగ్ పొలిటికల్ కౌంటరిచ్చారు. కేసీఆర్ దమ్మేంటో దేశం మొత్తం చూసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, కేసీఆర్ అచ్చంపేట్ సభలో మాట్లాడుతూ.. ‘తెలంగాణ కోసం నేను బయలుదేరి 24 ఏళ్లు అయ్యింది. తెలంగాణ సాధన కోసం నేను పక్షిలా తిరిగాను. కొంతమంది ఇప్పుడొచ్చి కేసీఆర్‌కు దమ్ముందా? అని మాట్లాడుతున్నారు. తెలంగాణ వచ్చేది లేదంటూ ఒకప్పుడు హేళనగా మాట్లాడారు. పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టే తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ ఈరోజు మూడు కోట్ల టన్నుల వడ్లు పండిస్తోంది. మీ కళ్లకు కనిపిస్తోంది కేసీఆర్ దమ్ము కాదా?.
కొడంగల్‌కు రా అని ఒకరు.. గాంధీభవన్‌కు రావాలని మరొకరు సవాల్ చేస్తున్నారు. కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. రాజకీయం అంటే ఇలాంటి సవాల్ చేయాలా?. వాళ్లకు దిక్కులేకపోయినా మనకు నీతులు చెప్పేందుకు వస్తున్నారు. ఎవరు ఎవరికి ఉపన్యాసాలు ఇస్తున్నారో ప్రజలు ఆలోచించాలి. పదేళ్లలో దేశానికి దిక్సూచిలా తెలంగాణను మార్చాం. దేశంలో రైతుబంధు పుట్టించిందే కేసీఆర్. మెడపై కత్తిపెట్టడమే తప్ప రైతుకు రూపాయి ఇచ్చారా?. 24 గంటల కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణనే. ప్రధానమంత్రి రాష్ట్రంలో 24 గంటల కరెంట్ లేదు.
నేను ఎన్నికల కోసం చేయడం లేదు.. ప్రజల కోసం చేస్తున్నాను. ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇవ్వను. తెలంగాణలో మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం పండుతోంది. 24 గంటల కరెంట్ ఇస్తామంటే అసెంబ్లీలో జానారెడ్డి గజమెత్తు లేచాడు. తెలంగాణ వచ్చిన రెండేళ్లలోనే 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించాం. బీఆర్‌ఎస్ మేనిఫెస్టోపై గ్రామాల్లో చర్చ జరుగుతోంది. పెన్షన్‌ను వందల నుంచి వేలల్లోకి తీసుకెళ్లింది కేసీఆర్. కాంగ్రెస్ నేతలకు కావాల్సింది తెలంగాణ బాగోగులు కాదు.. పెత్తనం మాత్రమే. బీజేపీపాలిత రాష్ట్రాల్లో మంచినీళ్లకు దిక్కులేదు. కాంగ్రెస్ వాళ్లు వస్తే ధరణి తీసేస్తాం అంటున్నారు. ధరణితో రైతుల భూముల లెక్కలు ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉన్నాయి. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఎవరు? కాంగ్రెస్ కాదా?. ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. నవంబర్ 30న దుమ్ములేపాలి’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment