కల్యాణం.. కమనీయం | Grand celebrations of paravati parameshwara marriage | Sakshi
Sakshi News home page

కల్యాణం.. కమనీయం

Published Fri, Jan 17 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM

Grand celebrations of paravati parameshwara marriage

 శ్రీ ఉమామహేశ్వర క్షేత్రం కొండ కింద ఉన్న భోగ మహేశ్వరంలో గురువారం తెల్లవారుజామున పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగుతుంటే... ఆహా... ఏమి భాగ్యం అంటూ అశేష భక్తుజనం ఒళ్లంతా కళ్లు చేసుకుని చూశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేకంగా
 అలంకరించిన కల్యాణమండపంలో స్వామివార్ల కల్యాణోత్సవ వేడుక
 నిర్వహించారు.
 - న్యూస్‌లైన్, అచ్చంపేట
 
 ప్రతి ఏటా మకర సంక్రాంతి పర్వదినం రోజు నుంచి ఉమామహేశ్వర క్షేత్రం క్షేత్రంలో వారం రోజుల పాటు  బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా క్షేత్రం కొండ కింద భోగ మహేశ్వరంలో గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా చేశారు. బుధవారం రాత్రి అచ్చంపేట శ్రీ భ్రమరాంబ ఆలయంతో పాటు నియోజక వర్గంలోని మండలాలు, గ్రామాల నుంచి ప్రభోత్సవాలు బయల్దేరి, గురువారం ఉదయం భోగమహేశ్వరం చేరుకున్నాయి.
 
 తెల్లవారుజామున ఉమామహేశ్వర క్షేత్రం నుంచి పార్వతీ పరమేశ్వరులను కిందకొండకు తీసుకరావడంతో కల్యాణోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. అచ్చంపేట ఎమ్మెల్యే పి.రాములు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణలు స్వామివార్లకు కల్యాణోత్సవ పట్టు వస్త్రాలను అందజేశారు. అనంతరం వేద పండితులు వీరయ్యశాస్త్రి, నీలకంఠశాస్త్రిలు శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. బల్మూర్, లింగాల, అమ్రాబాద్, ఉప్పునుంతల, అచ్చంపేట, వంగూరు మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
 
 కల్యాణోత్సవం అనంతరం భక్తులు ఉమామహేశ్వరం క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు జిల్లాలోని నలుమూలల నుంచే గాక రాష్ర్టంలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు హాజరవుతున్నారు. కళ్యాణ కార్యక్రమంలో ఉమామహేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ లచ్చునాయక్, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, కమిటీ సభ్యుడు చంద్రశేఖర్, అచ్చంపేట శ్రీభ్రమరాంబ దేవాలయం చైర్మన్ నల్లపుశ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి బైరమోని గౌరిశంకర్, కొండురు భగీరత్‌నాథ్, ఆకుతోట రామనాథం, కందూరు సుధాకర్, మండికారి బాలజీ, ఎం.రామనాథం, శ్రీనివాసులు తదితరుల పాల్గొన్నారు.
 
 ఘనంగా బ్రహ్మోత్సవాలు...
 ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం ప్రాంతఃకాల పూజలు నిర్వహించారు. 9గంటలకు గవ్యాంత పూజలు, వాస్తు పూజ, వాస్తహోమం, రుద్రాభిషేకం, రుద్రహోమం, ప్రాతరౌపాసన, నిత్యబలిహరణ, సాయంత్రం 4గంటలకు సాయమౌపాసన, బలిహరణం, నీరాజనం, మంత్రపుష్పం, నందివాహన సేవ, తీర్థప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
 
 ఘనంగా లక్ష్మీనరసింహుని బ్రహ్మోత్సవాలు
 కొల్లాపూర్‌రూరల్ , న్యూస్‌లైన్: మండలపరిధిలోని సింగోటం శ్రీలక్ష్మీ నరసింహ్మస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం ప్రధాన ఆల యంతో పాటు రత్నగిరి కొండపై అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజ లు చేశారు. ఆలయంలో చైర్మన్ సురభి వెంకట జగనాదిత్య లక్ష్మారావు ఆధ్వర్యంలో కలశ పూజ, కుంకుమార్చన, అభిషేకం, తదితర కార్యక్రమాలు నిర్వహిం చారు. రాత్రి ప్ర భోత్సవం, స్వామివారి ఉత్సవ విగ్రహాలను సింహ వాహనం పై మేళతాళాల నడుమ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నేత బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు ఓరుగంటి సంపత్‌కుమార్ శర్మ, సతీష్‌కుమార్ శర్మ, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాసులు, ఆనంద్, సత్యనారాయణ, సత్యం తదితరలు  పాల్గొన్నారు.
 
 భక్తిశ్రద్ధలతో రథోత్సవం
 ఆరగిద్ద (గట్టు), న్యూస్‌లైన్ : ఆరగిద్ద శివ వీరాంజనేయ స్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి నిర్వహించిన రథోత్సవం కనుల పండువగా జరిగింది. మేళతాళాలు, బాజాభజంత్రీలు, విద్యుత్ దీపాలంకరణల మధ్య స్వామి వారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మకర సంక్రాంతి పండుగ రోజున ప్రతిఏటా వేడుకను నిర్వహించడం ఆన వాయితీ. బుధవారం ఉదయం స్వామివారికి పల్లకీసేవ నిర్వహించారు.
 
 రాత్రి 11 గంటలనుంచి రథోత్సవాన్ని నిర్వహించారు. స్థానికులతోపాటు గట్టు, గొర్లఖాన్‌దొడ్డి, తప్పెట్లమొర్సు, పెంచికలపాడు తదితర గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామంలో ఓవైపు సంక్రాంతి సంబరాలు, మరో వైపు జాతర సంబరాలు ఓకే రోజున జరుపుకోవడంతో గ్రామంలో సందడి నెలకొంది. అలాగే  ఆలూరు గ్రామంలో శ్రీఆంజనేయస్వామి జాతర సందర్భంగా బుధవారం రాత్రి వైభవంగా రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పోటీపడి రథాన్ని లాగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement