-
ఓడీఎఫ్ పట్టణాలుగా అచ్చంపేట, షాద్‌నగర్
-
తెలంగాణలో 5 పట్టణాల్లో 2 పాలమూరు జిల్లావే..
-
ప్రత్యేక గుర్తింపునిచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ
-
వందశాతం మరుగుదొడ్ల నిర్మాణానికి ముందడుగు వేసిన కమిషనర్లు
స్వచ్ఛభారత్ మిషన్ (అర్బన్) కింద బహిరంగ మలమూత్ర విసర్జనరహిత (ఓడీఎఫ్) ప్రాంతాలుగా జిల్లాలోని షాద్‌నగర్, అచ్చంపేట పట్టణాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గుర్తించింది. రాష్ట్రంలో ఐదు పురపాలికలకు ఓడీఎఫ్ గుర్తింపు రాగా, అందులో రెండు మన జిల్లావే ఉండటం విశేషం. సంపూర్ణ పారిశుద్ధ్య పట్టణాలుగా తీర్చిదిద్దడంలో మరుగుదొడ్ల అవశ్యకతను గుర్తించిన ఆయా పురపాలిక కమిషనర్లు వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేయాలని సంకల్పించి, లక్ష్యసాధనలో వారు సఫలీకృతులయ్యారు. ఓడీఎఫ్ గుర్తింపు వచ్చిన పట్టణాలపై ఈ ఆదివారం ప్రత్యేక కథనం..
– అచ్చంపేట/షాద్‌నగర్
పారిశుద్ధ్య సమస్య నివారించేందుకు అచ్చంపేట నగరపంచాయతీ, షాద్‌నగర్ మున్సిపాలిటీల్లో బహిరంగ మలవిసర్జన ప్రాంతాలను గుర్తించేందుకు ఆయా పట్టణాల కమిషనర్లు కె.జయంత్‌కుమార్‌రెడ్డి (అచ్చంపేట), రామాంజులరెడ్డి (షాద్‌నగర్) శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత కౌన్సిలర్లు, మహిళ సంఘాలతో సమావేశాలు నిర్వహించి, ఆయా వార్డుల్లో మరుగుదొడ్లు లేని ప్రతి ఇంటిని గుర్తించారు. మున్సిపల్ సిబ్బంది, అధికారులు బృందాలుగా విడిపోయి ఇంటింటి సర్వే చేపట్టి వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారి వివరాలు సేకరించారు. అచ్చంపేట నగరపంచాయతీలో 6,224 ఇళ్ల ఉండగా 600 ఇళ్లలో, షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో18,005 ఇళ్లు ఉండగా 772 ఇళ్లలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేనట్లుగా గుర్తించారు. ఆ వెంటనే వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రణాళిక సిద్ధం చేశారు. అచ్చంపేటలోని దర్శన్‌గడ్డలో మొదటిదశలోనే వందశాతం పూర్తి చేశారు. మరుగుదొడ్ల యొక్క ఆవశ్యకతపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, వార్డుల్లో మరుగుదొడ్లు లేని ఇళ్లను పూర్తి చేయించే దిశగా అధికారులు అడుగులు వేసి, అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఆ తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్(అర్బన్) కింద బహిరంగ మల విసర్జనరహిత ప్రాంతాలుగా గుర్తింపు కోసం థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ప్రక్రియలో ఈరెండు పట్టణాలు ఎంపికయ్యాయి.
ఓడీఎఫ్ గుర్తించారు ఇలా..
ఆయా పట్టణాలకు దూరంగా ఉన్న వీధులు, పాత బస్తీలు, కాలనీలు, దినసరి కూలీలు ఉన్న ఇళ్లల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేన్నట్లు గుర్తించారు. వార్డు కౌన్సిలర్లు, మహిళా సంఘాల సహకారంతో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాల్సిన అవశ్యకతపై ఇంటి యాజమానులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయం గురించి వివరించి, మరుగుదొడ్లు మంజూరు చేపట్టారు. ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధతో దగ్గరుండి నిర్మాణం చేయించారు. అచ్చంపేట నగరపంచాయతీ ఒక అడుగుముందుకేసి ఆర్థిక ఇబ్బందులున్న వారికి ఇతరుల సహకారంతో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయించారు. లక్ష్యం సాధించిన కమిషనర్లు ఈవిషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ప్రొటోకాల్ ప్రకారం ఓడీఎఫ్ గుర్తింపు కోసం ముందుగా వార్డులు, పట్టణాలను స్వయంగా ఓడీఎఫ్‌గా ప్రకటించుకుని, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు నివేదిక అందించాలి. తర్వాత 30రోజుల వ్యవధిలో ఆ శాఖ తనఖీ చేస్తుంది. సేవాస్థాయి అంచనా (నిర్మాణం, గృహ లభ్యత, కమ్యూనిటీ, ప్రజా మరుగుదొడ్లు) స్వతంత్ర పరిశీలనల అంచనా ఆధారంగా నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతుంది. కేంద్రం నుంచి వచ్చిన బృందం మురికి వాడ, పాఠశాల, ప్రభుత్వ మార్కెట్ స్థలాలు, మతపరమైన స్థానంలో, నివాస ప్రాంతం, బస్టాండు, రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేస్తారు. రోజు మొత్తం ఏ సమయంలో కూడా ఒక్క వార్డులో గానీ, పట్టణంలోని గానీ ఒక్కరు కూడా బహిరంగ మలవిసర్జన చేయకపోతే బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతంగా నిర్ధారిస్తారు.
అవార్డులు..
అచ్చంపేట నగరపంచాయతీ కలెక్టర్ టీకే శ్రీదేవి నుంచి జిల్లా స్థాయిలో ఓడీఎఫ్ అవార్డుతో పాటు రూ.25వేల నగదు అందుకున్నారు. గతేడాది హారితహారం కింద కలెక్టర్ నుంచి ప్రశంసలు, అవార్డు అందుకోగా, ఈ ఏడాది హరిత మిత్ర కింద రాష్ట్రస్థాయి అవార్డుతో పాటు రూ.లక్ష ప్రకటించారు. షాద్‌నగర్ సైతం స్వచ్ఛ పట్టణంగా జిల్లాస్థాయిలో అవార్డు అందుకుంది.
అందరి సహకారంతోనే..
పట్టణ ప్రజలు, చైర్మన్, కౌన్సిలర్లు, మహిళ సంఘాలు, నాయకులు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఈఘనత సాధించాం. పేదలకు మరుగుదొడ్లు నిర్మించడం, ఉత్తమ నగరపంచాయతీగా రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చినందుకు గర్వంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో చోటు దక్కడం సంతోషంగా ఉంది. ప్రణాళికతో ముందుకు ఎవళ్లడం వల్లనే లక్ష్యాన్ని సాధించగలిగాం.
– కె.జయంత్‌కుమార్‌రెడ్డి, నగరపంచాయతీ కమిషనర్, అచ్చంపేట
దాతలు, ప్రజలు సహకరించారు
దాతలు, ప్రజలు సహకరించడంతోనే వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయగలిగాం. ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్లి వ్యక్తిగత మరుగుదొడ్డి లేకపోవడం వల్ల కలిగే రోగాల గురించి వివరించాం. 90రోజుల్లో 862వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం రూ.12వేలు ప్రతి లబ్ధిదారుడికి అందచేసింది. కానీ నిర్మాణానికి రూ.15వేల ఖర్చు వస్తుండటంతో కొందరు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి ముందుకు రాలేదు. పట్టణంలోని కొందరు దాతల సహకారంతో రూ.3వేల వరకు లబ్ధిదారుడికి అందచేశాం. దీంతో 100శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయ్యింది. ప్రజల సహకారం ఉంటే బహిరంగ మల విసర్జనను పూర్తిగా ఆరికడతాం.
– రామాంజులరెడ్డి, మున్సిపల్ కమిషనర్, షాద్‌నగర్