సీఎంపై జిల్లా వాసులకు ప్రగాఢ విశ్వాసం
సమన్వయంతో పనిచేస్తాం
టీఆర్‌ఎస్‌దే విజయం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
హన్మకొండ : గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌ను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుని సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం హన్మకొండలోని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు తన్నీరు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. మార్చి 6వ తేదీన జరుగనున్న మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసిందన్నారు. ఊహించిన దాని కంటే పార్టీలో అభ్యర్థులు టికెట్లు ఆశించారని అన్నారు. విజయావకాశాలను దృష్టిలో పెట్టుకుని నామినేషన్లు వేసిన వారిని ఉపసంహరణ చేయించామన్నారు. ఆశావహులకు నచ్చచెప్పడంతో తోడ్పాటు అందించారన్నారు. జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్‌పై ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు. ఉద్యమ కాలం నుంచి టీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్ వెన్నంటి ఉన్నారన్నారు. వరంగల్ సమగ్రాభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జనవరిలో మూడు రోజుల పాటు నగరంలో ఉండి నగర అభివృద్ధిపై ప్రణాళికను రూపొందించి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు.
రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిఏటా రూ.300 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. హైదరాబాద్ తర్వాత రెండో రాజధాని తరహాలో వరంగల్‌ను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఐటీ కంపెనీలు వరంగల్‌లో ఏర్పాటు చేయాలని సంబందిత శాఖ అధికారులను ఆదేశించారన్నారు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా రూ.8.69 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఒక ఎంపీ, అయిదుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. అందరం సమన్వయంతో పని టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తామన్నారు. మంత్రి తన్నీరు హరీష్‌రావు మాట్లాడుతూ మిగతా రాష్ట్రాల సీఎంలతో పోల్చితే సీఎం కేసీఆర్ పని తీరు బాగుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి చేపడుతున్న పథకాలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల్లో కేసీఆర్ పట్ల విశ్వాసాన్ని నింపాయన్నారు. ఇండియా టుడే అవార్డు రావడమే సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనమన్నారు.
ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా వరంగల్‌ను చూడాలని సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. హైదరాబాద్ తర్వాత ఎక్కువ రోజులు వరంగల్‌లోనే గడిపారని తెలిపారు. ఉద్యమకారులకు, పని చేసిన వారికి అభ్యర్థులుగా అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ సూచించిన మేరకు అభ్యర్థుల ఎంపిక చేశామని చెప్పారు. గ్రేటర్ వరంగల్ రూపు రేఖలు మారేలా ప్రభుత్వ పని తీరు ఉంటుందన్నారు. టికెట్లు రాని కార్యకర్తలకు భవిష్యత్‌లో అవకాశాలు కల్పిస్తామన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, చల్ల ధర్మారెడ్డి, నాయకులు గుడిమల్ల రవికుమార్, భరత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
కేసీఆర్‌కు కానుకగా గ్రేటర్ వరంగల్
Published Sat, Feb 27 2016 1:29 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement